పేదల కోసమే ఉచిత న్యాయ సేవ
– క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలి
– మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి టీ.స్వప్న
తాండూరు, దర్శిని ప్రతినిధి : వివిధ కేసులలో ఆర్థిక స్థోమతలేదని పేదలకు ఉచితంగా న్యాయ సేవలు అందించడం జరుగుతుందని తాండూరు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి టీ.స్వప్న అన్నారు. శుక్రవారం మున్సిప్ కోర్టు ప్రాంగణంలో మండల లీగల్ సర్వీసెస్ కమిటి ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సేవ సంస్థ(న్యాయ అక్షరాస్యత శిబిరం)పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మండల లీగల్ సర్వీసెస్ కమిటి చైర్మన్, న్యాయమూర్తి టీ.స్వప్న ఆధ్వర్యంలో అంగన్‌వాడి టీచర్లకు ఉచిత న్యాయ సేవ సంస్థపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి టీ.స్వప్న మాట్లాడుతూ గ్రామాల్లో..పట్టణాల్లో ఎంతో మంది పేదలకు చిన్న చిన్న విషయాలలో, భూతగాదాలలో కేసులదాక వెళ్తారన్నారు. యువకులు మహిళలు, అమ్మాయిలలను వేధించి జైలుపాలు అవుతున్నారని, భార్య భర్తలు మనస్పర్థలతో విడిపోయేందుకు సిద్దమవుతుంటారన్నారు. అలాంటి కేసుల్లో ఆర్థిక స్థోమత లేని పేదలకు ఉచితంగా న్యాయ సహాయం అందించేందుకు ఉచిత న్యాయ సేవ సంస్థ పనిచేస్తుందన్నారు. ఇందులో భాగంగా ప్రతి శనివారం కోర్టులో ఉచిత న్యాయ సేవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. అంగన్‌వాడీ టీచర్లు క్షేత్రస్థాయిలో ఉచిత న్యాయ సేవలపై అవగాహన కల్పించాలన్నారు. ఈ వ్యవస్థ ద్వారా పేదలందరికి న్యాయం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. దీంతో పాటు గ్రామాల్లో బాల్య వివాహాల నియంత్రణపై కూడ అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో కోర్టు సీనీయర్ న్యాయవాది శ్రీనివాస్‌రెడ్డి, రాంరెడ్డి, బార్ అసోసియేషన్ కార్యదర్శి పాశం రవికుమార్, న్యాయవాదులు చంద్రశేఖర్, గోసాయి సుధాకర్, విశ్వనాథం, అనితాగుప్త, బార్ అసోసియేషన్ కోశాధికారి సుదర్శన్, ఎస్ఐ సతీష్, కోర్టు సిబ్బంది, అంగన్‌వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
