కుక్కల వేటకు వేళాయే..!
– తొలగనున్న వీధి కుక్కల బెడద
– పట్టణంలో నుంచి తరలించేందుకు చర్యలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలో వీధి కుక్కల స్వైర విహారంతో ప్రజలు బెంబేలెత్తి పోతున్న విషయం చెప్పనక్కర్లేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు తాండూరు మున్సిపల్ పాలకవర్గం, యంత్రాంగం చర్యలు చేపడుతోంది. పట్టణంలో సంచరిస్తున్న వీధి కుక్కలను తరలించేందుకు ఏర్పాట్లను చేస్తోంది. రేపో.. ఎల్లుండో వీధి కుక్కల వేటను ప్రారంభించబోతుంది. ఇటీవలే మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, ఆర్డీఓ, ఇంచార్జ్ కమీషనర్ అశోక్ కుమార్‌లు మున్సిపల్ ఫ్లోర్ లీడర్లతో కలిసి వీధి కుక్కల వేటపై చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. పట్టణంలో గత కొన్ని రోజుల నుంచి వీధి కుక్కలు ప్రజలకు దాడులకు పాల్పడుతూ గాయాలపాలు చేసిన సంఘటనలు అందరికి తెలిసిందే. ప్రధానంగా మార్వాడి బజార్, పాత తాండూరు, ఇందిరానగర్, మల్‌రెడ్డిపల్లి ప్రాంతాల్లో ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో విసిగి వేసారిన ప్రజలు మున్సిపల్ అధికారులకు విన్నవించారు. దీంతో మున్సిపల్ చైర్ పర్సన్, ఆర్డీఓ అశోక్‌కుమార్‌లు వీధి కుక్కలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
