గొడవలన్నీ మర్చిపోతాం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

గొడవలన్నీ మర్చిపోతాం..!
– అక్రమ ఇసుక రవాణా కట్టడికి చర్యలు
– మైన్స్ నిధుల వినియోగంపై దృష్టి
– తాండూరుకు మెడికల్ కాలేజీ సాధనకు కృషి
– సమాచార, గనుల భూగర్భ వనరుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : గతంలో జరిగిన గొడవలన్నీ మరిచిపోయి పార్టీ కోసం పనిచేస్తామని తెలంగాణ రాష్ట్ర సమాచార, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. శనివారం మొదటి సారి తాండూరుకు వచ్చిన మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డిలు మీడియాతో సమావేశం అయ్యారు. పట్టణంలోని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నివాసంలో వారు మీడియాతో మాట్లాడారు. తాండూరు నియోజకవర్గంలో గతంలో పైలెట్ రోహిత్ రెడ్డితో చిన్న చిన్న గొడవలు జరిగాయని, అవన్నీ అన్నదమ్ముల గొడవల్లా మరిచిపోయి పార్టీ కోసం పనిచేస్తామన్నారు. రెండో సారి మంత్రిగా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ కు మూడోసారి విజయం వరించేలా కలిసి పనిచేస్తామన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ ఇసుక రవాణపై దృష్టి సారించడం జరిగిందన్నారు. ఎక్కడైనా అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో పాటు మైన్స్ నిధుల వినియోగంపై దృష్టిసారిస్తామన్నారు. జిల్లాలో మెడికల్ కాలేజీ అందించిన సీఎం కేసీఆర్ తో చర్చించి తాండూరులో మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం కృషి చేస్తామన్నారు. అదేవిధంగా ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ మహేందర్ రెడ్డి, రోహిత్ రెడ్డిల కలయికతో బీఆర్ఎస్ లో ఏర్పడిన ప్రతిష్కంభన కథ సుఖాంతం అయ్యిందన్నారు. వన్స్ మోర్ మంత్రిగా మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలు కొనసాగడం ఖాయమన్నారు.

ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయన్నారు. మహేందర్ రెడ్డితో కలయిక తరువాత ప్రతిపక్షా గుండెల్లో రైలు పరుగెడుతున్నాయన్నారు. వచ్చే ఎన్నికల తరువాత పదిరెట్ల అభివృద్ధిని చేసి చూస్తామన్నారు. అనంతరం మంత్రి మహేందర్ రెడ్డిని, ఎంపీ రంజిత్ రెడ్డిని, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని పార్టీ నేతలు సన్మానించారు. మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీలు ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు, శ్రీశైల్ రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అపూ(నయూం), మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..

పేద విద్యార్థుల సేవలో..!