నమోః రామలింగేశ్వరా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

నమోః రామలింగేశ్వరా..!
– జినుగుర్తిలో వైభవంగా జాతర
– భారీగా తరలివచ్చిన భక్తులు
– దర్శించుకున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : నమో శ్రీరామలింగేశ్వర అంటూ భక్తులు తాండూరు మండలం జినుగుర్తిలో వెలసిన శ్రీరామలింగేశ్వరున్ని దర్శించుకున్నారు. శ్రావణమాసం ఆఖరి సోమవారం సందర్భంగా ఆలయంలో జాతర ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహించారు. జాతర సందర్భంగా ఆలయంలో వెలసిన రామలింగేశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి యేడాది మాదిరిగానే ఆలయ ధర్మకర్తలు కరంచంద్ మోహన్ దాస్, ఉత్తమ్ చంద్, జగదాంబ, ఆనంతయ్య కుటుంబ సభ్యులు ఇంటి నుంచి స్వామివారికి ఆనవాయితీగా నిర్వహిస్తున్న నైవేద్య సమర్పణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఈ ఊరేగింపులో దేవాలయ చైర్మన్ గౌడ్ ప్రవీణ్ గౌడ్, కాంగ్రెస్ యువనాయకులు అజ్మత్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. వారి నివాసం నుంచి కొనసాగిన ఊరేగింపు దేవాలయం వరకు చేరుకుంది. అనంతరం ధర్మకర్తలు, ఆలయ చైర్మన్, కమిటి సభ్యులు స్వామి వారికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అదేవిధంగా జాతరను దృష్టిలో ఉంచుకుని ఆలయ కమిటి చైర్మన్ ప్రవీన్ గౌడ్ దేవదాయ శాఖ సహాకారంతో భక్తులకు అన్ని ఏర్పాట్లను చేశారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణ కిక్కిరిసిపోయింది. భక్తులు స్వామి వారిని దర్శించుకుని సల్లంగా చూడూ రామలింగేశ్వరా అంటూ వేడుకున్నారు.

ఈ జాతర ఉత్సవాల్లో హైదరాబాద్ కు చెందిన భక్తుడు దేవాలయంలో దత్తాత్రేయుని విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు అందజేశారు. మరోవైపు రామలింగేశ్వర జాతర ఉత్సవాలకు తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హాజరై శివున్ని దర్శించుకున్నారు. స్వామికి పూజలు నిర్వహించారు. జాతర ఉత్సవాలలో ఆలయ ధర్మకర్తలు, గ్రామస్తులు భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ జాతర ఉత్సవాల్లో గ్రామ సర్పంచ్ పట్లోళ్ల రత్నమ్మ, రైతు సమితి కోఆర్డినేటర్ రాంలింగారెడ్డి, ఆలయ కమిటి సభ్యులు శ్రీధర్ గౌడ్, శేఖర్, రాజు, అండాలమ్మ, ఉపసర్పంచ్ ఆశం అలీ, ఎమ్మార్పీఎస్ నాయకులు నర్సింలు, గ్రామ పెద్దలు కుర్వ నర్సింలు, యువనాయకులు విష్ణువర్ధన్, యాదగిరి, మధు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..

 

పేద విద్యార్థుల సేవలో..!