హోమ్ ఓటింగ్ సక్సెస్
– ఓటు వేసిన వృద్దులు, వికలాంగులు
– ఇంటివద్దకు వెళ్లి స్వీకరించిన ప్రత్యేక బృందాలు
– పరిశీలించిన ఎన్నికల అధికారి శ్రీనివాస్ రావు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎన్నికల సంఘం తొలిసారిగా ఇంటినుంచి(హోమ్ ఓటింగ్) ఓటు వేసేందుకు చేపట్టిన కార్యక్రమం తాండూరులో సక్సెస్ అయ్యింది. తాండూరు ఎన్నికల అధికారి శ్రీనివాస్ రావు ఆదేశాల మేరకు తాండూరులో హోమ్ ఓటింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. తాండూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంటి నుంచి ఓటు వేసేందుకు 80 ఏండ్లు నిండిన వృద్దులకు, వికలాంగులకు అవకాశం కల్పించిచన సంగతి తెలిసిందే. ఈ మేరకు తాండూరులో 24 మంది ఓటర్లు దరఖాస్తులు చేసుకున్నారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు తాండూరు ఎన్నికల అధికారి శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో దరఖాస్తు ఓటర్ల నుంచి ఓటు హక్కును స్వీకరించేందుకు రెండు ప్రత్యేక బృందాలను నియమించారు.
ఇందుకు రూట్ మ్యాప్‌లను కూడా ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం నుంచి ప్రత్యేక బృందాలు దరఖాస్తు చేసుకున్న వృద్దులు, వికలాంగుల నుంచి ఓటు హక్కును స్వీకరించారు. తాండూరు పట్టణంతో పాటు మండలంలోని అంతారం, దస్తగిరిపేట్, చెంగోల్, కోటబాస్పల్లి, మల్కాపూర్, పెద్దేముల్ మండలం గిర్మాపూర్, యాలాల మండలంలో రాఘవపూర్, పగిడ్యాల, ముద్దాయిపేట్, గోరేపల్లి, సంగెఖుర్దు, హాజీపూర్, బషీరాబాద్ మండలంలో గొట్టిగ కలాన్, బషీరాబాద్, జీవన్గీ గ్రామాల నుంచి హోమ్ ఓటింగ్ కార్యక్రమం చేపట్టారు.

ఇంటి వద్ద ఉన్న వృద్దులు, వికలాంగులు స్వేచ్చగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హోమ్ ఓటింగ్ ప్రక్రియను తాండూరు ఎన్నికల అధికారి, ఆర్డీఓ శ్రీనివాస్ రావు పరిశీలించారు. ఎక్కడా అవకతవకలు జరగకుండా పక్కాగా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. గురువారం ఇంటి వద్ద లేని ఓటర్ల నుంచి శుక్రవారం ఓటింగ్ స్వీకరించడం జరుగుతుందని ఎన్నికల అధికారి శ్రీనివాస్ రావు తెలిపారు. ఈ అవకాశాన్ని దరఖాస్తులు దారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇది కూడా చదవండి…

