రైతులకు శుభవార్త..!

జాతీయం తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

రైతులకు శుభవార్త..!
– రైతు బంధు పంపిణీకి లైన్‌ క్లియర్
– అనుమతి ఉత్తర్వులు జారీ చేసిన ఈసీ
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంతో రైతులకు శుభవార్త వినిపించింది. యాసంగి సీజన్‌ కోసం రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం రాత్రి అనుమతించింది. ఏటా ప్రభుత్వం పెట్టుబడి సాయంగా ఒక్కో సీజన్‌కు ఎకరానికి రూ.5 వేల చొప్పున రెండు సీజన్‌లకు మొత్తం రూ.10 వేలను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది. రాష్ట్రంలో వానాకాలంతో పాటు యాసంగి సీజన్‌ ఆరంభానికి ముందు నిధులు విడుదల చేయడం ఆనవాయితీ. ఈసారి శాసనసభ ఎన్నికల దృష్ట్యా కోడ్‌ అమల్లోకి రావడంతో ప్రభుత్వం నుంచి యాసంగి సీజన్‌కు నిధుల జమ జరగలేదు.

ఇది కొనసాగుతున్న పథకమని కోడ్‌ వర్తించదని… యథావిధిగా ఈ సాయం విడుదలకు అనుమతించాలని ప్రభుత్వం గత నెలలో ఈసీని కోరుతూ లేఖ రాసింది. పరిశీలించిన ఈసీ తాజాగా నిధుల జమకు అనుమతి మంజూరు చేసింది. ఈ నెల 28 వరకు చెల్లింపులు చేపట్టాలని స్పష్టం చేసింది. 28 సాయంత్రానికి ప్రచార గడువు ముగుస్తున్నందున.. అప్పటి నుంచి ఈ నెల 30న పోలింగ్‌ ముగిసే వరకు నిధులను జమ చేయవద్దని ఆదేశించింది. ఈసీ అనుమతించడంతో ప్రభుత్వం రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో శనివారం నుంచి సొమ్ము జమ చేసేందుకు సన్నాహాలు చేపట్టింది. ఈ మొత్తం రూ.7,700 కోట్లకుపైగా ఉంటుంది. దీంతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న పోరాటం ఫలించింది.

యాసంగిలో 70 లక్షల మందికి లబ్ధి
రైతుబంధు పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయశాఖ అందుకు ఏర్పాట్లు చేస్తున్నది. గతంలో మాదిరిగానే ఈ యాసంగి సీజన్‌లో కూడా తక్కువ భూమి ఉన్న రైతుల నుంచి రైతుబంధు పంపిణీ ప్రారంభిస్తామని వ్యవసాయశాఖ తెలిపింది. రైతుబంధు ద్వారా యాసంగి సీజన్‌లో 70 లక్షల మంది రైతులు లబ్ధిపొందనున్నారని వెల్లడించింది. రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేస్తామని పేర్కొన్నది. ఈ నెల 25,26,27 తేదీల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయని, 29,30 తేదీల్లో రైతుబంధు పంపిణీకి ఎన్నికల సంఘం అనుమతించలేదని తెలిపింది.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!