బురిడీల బీఆర్ఎస్..!
– గ్రాంట్లు లేకున్నా గారడీ జీఓలు
– పైసల్ లేక పనులు వొదిలేసిన కాంట్రాక్టర్లు
– బురద రాజకీయాలు చేస్తే మరో గుణపాఠం
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– మాజీ ఎమ్మెల్యే వాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఎన్నికల ముందు దళితబందు, రైతుబంధు, బీసీబంధు, గొర్రెలు పంపిణీ చేస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వమే లబ్దిదారులను బురీడీ మోసం చేసిందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి విమర్శించారు. సోమవారం తాండూరు ప్రజా భవన్ (క్యాంపు ఆఫీసు)లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి రోజు ఆరు గ్యారెంటీలపై సంతకాలు 48 గంటల్లోనే ఆరోగ్య శ్రీ పథకం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేసిందన్నారు. ఖచ్చితంగా 100 రోజుల్లో ఇచ్చిన హామిలను అమలు చేసి తీరుతామన్నారు. 30రోజుల్లోనే కార్యాచరణలు అమలు చేస్తుంటే వీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చేసిన వాఖ్యలను ఖండించారు.
అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక హామీలను విస్మరించిందన్నారు. ఎన్నికల ముందు కూడా దళితబందు. రైతుబంధు, బీసీ బంధు. గొర్రెల పంపిణీపై హామీలు ఇచ్చి మోసం చేసిందన్నారు. తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సైతం తాండూరు అభివృద్ధికి గ్రాంట్లు లేకున్నా జీవోలు తీసుకవచ్చి గారడీ చేశారని అన్నారు. ఎస్డీఎఫ్లో గ్రాంట్లు లేకున్నా కాంట్రాక్టర్లలో పనులు చేయించారని, నిధులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు మద్యలో వదిలి వెళ్లారని ఆరోపించారు. దీంతో కోట్లాది రూపాయిల అభివృద్ధి పనులు పెండింగ్ లో ఉండిపోయాయన్నారు. మోసాలకు పాల్పడిన బీఆర్ఎస్ పార్టీని ఎవ్వరు నమ్మే పరిస్థితి లేదన్నారు. బురద జల్లే రాజకీయాలు మానుకోకపోతే మరో గుణపాఠం తప్పదన్నారు. దోరల పాలన నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉన్నారని, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో విజయం సాధించడం ఖాయమన్నారు.
ఇంటింటికి ప్రజా పాలన సంక్షేమ పథకాలు
అంతకుముందు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అధికారులతో ప్రజా పాలనపై సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్ని దరఖాస్తులు అందాయని, డాటా ఎంట్రీ ఎలా జరుగుతుందని ఆరా తీశారు. ఏయే అంశాలపై ఎక్కువ దరఖాస్తులు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వెల 28 నుంచి ఈనెల 6వ తేది వరకు జరిగిన ప్రజా పాలనను అధికారులు. ప్రజా ప్రతినిధుల సమస్వయంగా విజయవంతం చేశారని అన్నారు. 8 రోజుల పాటు నిర్వహించిన ప్రజా పాలనలో 73వేల 900ల దరఖాస్తులు వచ్చాయన్నారు. వచ్చిన దరఖాస్తుల్లో ప్రతి ఇంటింటికి ప్రజా పాలన సంక్షేమాన్ని అమలు చేస్తామన్నారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో ఉన్న తాండూరు నియోజకవర్గానికి వేల కోట్ల నిధులు సాధించి ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజా పాలన కార్యక్రమాన్ని. విజయవంతం చేసిన అధికారులు పాత్ర మరువలేనిదని, ప్రభుత్వం వారి సేవలను గుర్తించుకుంటుందన్నారు.
తాండూరుకు మరొక ఆధార్ సెంటర్
తాండూరులో ఆధార్ సెంటర్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. దీంతో తాండూరుకు మరో ఆధార్ సెంటర్ మంజూరుకు కృషి చేయడం జరిగిందన్నారు. త్వరలోనే తాండూరులో మరో ఆధార్ కేంద్రాన్ని ప్రారంభిస్తామన్నారు. అంతేకాకుండా బైపాస్ రోడ్డు అడ్డంకులను కూడా అధిగమించి పనులు పూర్తయ్యేలా దృష్టి సారిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు ప్రత్యేకాధికారి డా. చక్రపాణి. బషీరాబాద్ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి. డీసీసీబీ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, పెద్దేముల్ వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాస్ చారి. కౌన్సిలర్లు వీరజా బాల్ రెడ్డి, ప్రభాకర్ గౌడ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, సాయిపూర్ బాల్ రెడ్డి, మున్సిపల్ కమీషనర్ షఫీవుల్లా, తాండూరు తహసిల్దార్ తారాసింగ్, ఎంపీడీఓ సుదర్శన్ రెడ్డి, వివిధ మండలాల తహసీల్దార్లు, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

