పండగ దొంగలు పడ్డారు..!
– నాలుగు ఇండ్లలో దోపిడి యత్నం
– ప్రైవేటు ఉద్యోగి ఇంట్లో వెండి, నగదు అపహరణ ?
– తాండూరు పట్టణంలో చోరీల కలకలం
తాండూరు, దర్శిని ప్రతినిధి : పోలీసుల అనుమానాలు నిజం అయ్యాయి. పండగకి దొంగలొస్తారు జాగ్రత్త అని పోలీసులు హెచ్చరించినా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారి ఇండ్లలోనే పండగ దొంగలు పడ్డారు. పండక్కి ఊరేళ్లిన వారి ఇండ్లలో హస్త నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఒకే రోజు నాలుగు ఇండ్లలో చోరీకి యత్నించారు. ఓ ప్రైవేటు ఉద్యోగి ఇంట్లో వెండి, నగదును అపహరించుకుపోయినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన తాండూరు మున్సిపల్ పరిధిలో కలకలం రేపింది. మంగళవారం పట్టణంలోని గ్రీన్ సిటీ కాలనీలో నాలుగు ఇండ్లల్లో చోరీలు జరిగిన సంఘటన స్థానికుల ద్వారా వెలుగులోకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరుకు చెందిన వెన్నంరెడ్డి రాఘవ తాండూరు పట్టణంలోని గ్రీన్ సిటీ కాలనీలో అద్దెకు ఉంటున్నారు. ఇతను పట్టణంలోని శాంత్ మహాల్, శ్రీ లక్ష్మీ మహాల్ థియేటర్లలో సూపర్ వైజర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా కుటుంబంతో కలిసి ఏలూరుకు వెళ్లారు. మంగళవారం ఉదయం వారి ఇంటి తలుపులు, తాళాలు విరిగి ఉండడాన్ని స్థానికులు గమనించి రాఘవకు సమాచారం అందించారు. ఆయన పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా ఇంట్లో వస్తువులు చిందర వందరగా పడి ఉండడంతో పాటు బీరువాలో వస్తువులు మాయం అయినట్లు గుర్తించారు. ఇంట్లో అర కిలో వెండి, భార్య చీటీ డబ్బులు రూ. 18 వేల వరకు ఉన్నట్లు రాఘవ పోలీసులకు తెలిపారు. ఇంట్లో పోలీసులకు అవి కనిపించలేదని తెలిసింది. దీంతో ఇంట్లో చోరి జరిగినట్లు స్పష్టమవుతోంది.
అదే కాలనీలో అద్దెకు ఉంటున్న రాజు అనే ఉద్యోగి ఇంట్లో చోరీకి పాల్పడడగా అక్కడే ఏమి సోత్తు, వస్తువులు పోలేదన్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో పాటు మరో రెండిళ్లలో చోరీకి యత్నం జరిగిందని తెలిసింది. అయితే యజమానులు ఎవ్వరు లేకపోవడంతో వివరాలేమి తెలియలేదు. పండగకు ఊరెళ్లిన వారి ఇండ్లలో చోరీ సంఘటనలు వెలుగులోకి రావడం కలకలంరేపింది. ఈ సంఘటనపై పోలీసుల నుంచి వివరాలు తెలియ రావాల్సి ఉంది.
ఇదికూడ చదవండి….

