వైద్యుల కృషితో పెరిగిన ప్రభుత్వ ఆసుపత్రి ప్రతిష్ట
– జాతీయ స్థాయిలో నిలవడం గర్వకారణం
– వైద్యులను సన్మానించిన రాజకీయ, స్వచ్ఛంద సంఘాల నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: వైద్యుల కృషితోనే తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రతిష్ట పెరిగిందని, జాతీయ స్థాయిలో ఆసుపత్రి నిలవడం గర్వకారణమని స్థానిక రాజకీయ, స్వచ్ఛంద సంఘాల నాయకులు పేర్కొన్నారు. సోమవారం జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ మల్లికార్జున స్వామి ఆధ్వర్యంలో ఆసుపత్రి వైద్యులు, నర్సులు, సిబ్బందికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, బీసీ సంఘం తాండూరు కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్, బీజేపీ మహిళ మోర్చ జిల్లా అధ్యక్షురాలు సాహు శ్రీలత తదితరులు వైద్యులను ముందుండి నడిపించిన ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ మల్లికార్జున స్వామి, వైద్యులు, సిబ్బందిని సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత నెలలో జిల్లా ఆసుపత్రిలో రికార్డు స్థాయి 686 ప్రసవాలు చేసి.. జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిలవడం గర్వకారణమన్నారు.
ఆసుపత్రిలో వైద్యుల కృషి వల్ల పేదలకు కార్పోరేట్ స్థాయి వైద్యం అందుతుందని అన్నారు. సర్కారు ఆసుపత్రిపై పేదలకు నమ్మకం.. భరోసా పెరిగిందన్నారు. వైద్యుల శ్రమ వల్ల ఆసుపత్రి ప్రతిష్టి పెరిగిందన్నారు. మునుముందు మరిన్ని విభాగాలలో మెరుగైన వైద్యసేవలందించాలని ఆకాంక్షించారు.
ఈకార్యక్రమంలో బీజేపీ నాయకులు బంటారం భద్రేశ్వర్, కౌన్సిలర్ లావణ్య, ఆసుపత్రి ఆర్ఎంఓలు డాక్టర్ ఆనంద్ గోపాల్‌రెడ్డి, యాదయ్య, సీనియర్ వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

