నగదుతో పాటు తులం బంగారం..!
– కళ్యాణలక్ష్మీ,షాదీముబారక్ కింద అందజేత
– ప్రణాళికలకు ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని బీసీ, మైనార్టీ, గిరిజనులకు కాంగ్రెస్ సర్కారు కీలక నిర్ణయం తీసుకోటోంది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు నగదుతో పాటు తులం బంగారం ఇచ్చేందుకు సర్కారు భావిస్తోంది. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ శాఖలపై సమీక్ష నిర్వహించిన సీఎం.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.
సంక్షేమ హాస్టళ్లకు గ్రీన్ ఛానెల్ ద్వారా నిధులు విడుదల చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించేందుకు స్థలాలు గుర్తించి, అంచనాలు తయారు చేయాలన్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సమీక్షలో పాల్గొన్నారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ పాలనలో కల్యాణ్ లక్ష్మీ, షాదీ ముభారక్ పథకాలను ప్రవేశపెట్టింది. పేదింటి ఆడపిల్లల పెళ్లి ఖర్చుల కోసం లక్ష రూపాయల ఆర్ధిక సాయాన్ని లబ్దిదారులకు అందజేసింది. అయితే 2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ లక్ష నగదుతో పాటు తులం బంగారం ఇస్తామని ప్రకటించింది.
ఇదికూడా చదవండి…

