రోడ్డు ప్రమాదాల నియంత్రణ అందరి బాధ్యత
– హెల్మెట్, సీటు బెల్టులు తప్పక ధరించాలి
– ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు పాటించాలి
– వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి
– తాండూరులో జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : రోడ్డు ప్రమాదాల నియంత్రణ అందరి బాధ్యత అని వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో 35వ జాతీయ రహదారుల భద్రతా ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్సీ కోటిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఇందిరా చౌరస్తాలో విద్యార్థులతో మానవహారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ కోటిరెడ్డితో పాటు పోలీసు అధికారులు, పలువురు వాహనదారులు, విద్యార్థులు రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రతిజ్ఞ చేశారు. అదేవిధంగా ఆటోలు, బైకులు, లారీలపై వెళ్లే వాహనదారులకు, డ్రైవర్లకు గులాబీ పూలు అందించి రోడ్డు నిబంధనలు పాటించాలని అవగాహన కల్పించారు.
అంతకుముందు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నియంత్రణ అందరి బాధ్యత అన్నారు. తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలు అందించరాదన్నారు. వాహనాలు నడిపే సమయంలో అందరు జాగ్రత్తలు పాటించాలన్నారు. బైకు వెళ్లేవారు హెల్మెట్ ధరించాలని, కారులో వెళ్లే వారు సీటు బెల్టులు ధరించాలని సూచించారు. సెల్ ఫోన్లో మాట్లాడుతూ, పరధ్యానంగా వాహనాలు నడపరాదన్నారు. చిన్న తప్పుల కారణంగా జీవితాలు రోడ్డుపడే ప్రమాదం ఉందన్నారు. రోడ్డు నిబంధనలు పాటించి.. ప్రమాదాలను నియంత్రించడంలో భాగస్వాములు కావాలన్నారు.

ఈ కార్యక్రమంలో డీఎస్పీ శేఖర్ గౌడ్, పట్టణ సీఐ సంతోష్ కుమార్, రూరల్ సీఐ అశోక్, ఎస్ఐలు మధుసూదన్ రెడ్డి, కాశినాథ్, శంకర్, వేణుగౌడ్, ఆర్టీసీ డీఎం సమతా రెడ్డి, ఎంవీఐ లావణ్య, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శోభారాణి, కౌన్సిలర్ సంగీత ఠాకూర్, పలువురు నాయకులు, అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

