పోలిటీకల్ గేమ్..!
– పార్లమెంట్ పోరులో పోటాపోటీ
– బీఆర్ఎస్ నుంచి పైలెట్ రోహిత్ రెడ్డి..?
– కాంగ్రెస్ నుంచి పట్నం ఫ్యామిలీకి చాన్స్..?
– తెరపైకి ఎమ్మెల్యే సోదరుడి పేరు..?
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: చేవేళ్ల పార్లమెంట్ ఎన్నికలు రసవత్తరంగా మారబోతున్నాయి. ఈ సారి జరిగే ఎన్నికల కోసం పోలిటికల్ గేమ్ మొదలైపోయినట్లుగా కనిపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మద్య పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి ఇద్దరిద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. బీజేపీ నుంచి మాత్రం మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేరును స్పష్టంగా పేర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవలే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి పేరు వినిపిస్తోంది.
పార్లమెంట్ టిక్కెట్ ఒప్పందంతోనే మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, సునీతారెడ్డిలు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ప్రచారం ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి మొదట్లో ప్రస్తుత ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డిని పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. తాజాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గాలికీ ఓటమి పాలైన తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని స్థానిక నేతలు మీడియా ముందు ప్రకటించారు. ఈ ప్రచారం చేవేళ్ల పార్లమెంట్ ఎన్నికల పోరులో హీట్‌ను పెంచింది. ముఖ్యంగా తాండూరు రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మాజీ మంత్రి మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వెంటే ఉండి కాంగ్రెస్ పార్టీకి సపోర్టు చేసి ఓడిపోయేలా చేశారని ఆరోపణలు ఇప్పటికి ప్రకంపనలకు కారణాలుగా నిలుస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరి పార్లమెంట్ పోటీకి సిద్దమవుతున్న సునీతారెడ్డిని ఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు బీఆర్ఎస్ వ్యూహంలో భాగంగానే రోహిత్ రెడ్డిని బరిలో దించుతున్నారని ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీలోనే మరో పోటీదారునిగా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరుడు ఆర్బీఎల్ ఫ్యాక్టరీ యజమాని శ్రీనివాస్ రెడ్డి పేరు తెరపైకి వస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించి పార్టీలో చేరారు. చివరి నిమిషంలో మనోహర్ రెడ్డి ముందుకు రావడంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. అన్న కోసం టిక్కెట్ త్యాగం చేసిన కారణంగా ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పించాలని శ్రీనివాస్ రెడ్డి కోరినట్లు సమాచారం. పోటీ చేసేందుకు దరఖాస్తు కూడా సమర్పించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో చేవేళ్ల పార్లమెంట్ పోలీటికల్ పోరు రసవత్తరంగా మారింది. గెలుపు కోసం ఆయా పార్టీలు వేసే వ్యూహాలతో ఎవరు బరిలో ఉంటారనే చర్చనీయాంశంగా మారింది.
ఇది కూడా చదవండి…

