చెరుకు తోటలో గంజాయి సాగు..!
– రచ్చకట్ట తండాలో 3 కిలోల గంజాయి మొక్కలు స్వాదీనం
– కేసు నమోదు చేసిన తాండూరు ఎక్సైజ్ పోలీసులు
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి: చెరుకు తోటలో సాగుచేస్తున్న గంజాయి మొక్కలను తాండూరు ఎక్సైజ్ పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. ఈ సంఘటన బుధవారం వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని పెద్దేముల్ మండలంలో వెలుగులోకి వచ్చింది. తాండూరు ఎక్సైజ్ సీఐ తుక్యానాయక్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెద్దేముల్ మండల పరిధిలోని రచ్చకట్ట తండా గ్రామానికి చెందిన పూల్‌సింగ్(40) సర్వే నంబర్ 347/అ గల చెరుకు తోటలో గంజాయి మొక్కలను సాగుచేస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింంది. ఈ మేరకు బుధవారం తాండూరు ఎక్సైజ్ సీఐ తుక్యానాయక్ తన సిబ్బందితో కలిసి పంట పొలాల్లో దాడులు నిర్వహించారు. అక్కడ ఆరు అడుగుల ఎత్తులో మొక్కలు సాగులో ఉన్నట్లు గుర్తించారు. వాటిని ధ్వంసం చేయగా రెండు కిలోల బరువు అయ్యింది. దీంతో పాటు చేరుకు తోటలో గంజాయి సాగుచేసిన రైతు ఇంట్లో కూడ తనిఖీలు చేపట్టగా మరో కిలో వరకు గంజాయిని స్వాదీనం చేసుకున్నారు. అధికారుల దాడులతో రైతు పరారి అయినట్లు సీఐ తుక్యానాయక్ వెల్లడించారు. ఈ మేరకు అతనిపై కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.
పంట పొలాల్లో గంజాయి సాగుచేస్తే చర్యలు తప్పవు
పంట పొలాల్లో ఎవరైనా గంజాయి మొక్కలను సాగుచేస్తే చర్యలు తప్పవని తాండూరు ఎక్సైజ్ సీఐ తుక్యానాయక్ హెచ్చరించారు. గ్రామాల్లో గంజాయి మొక్కుల సాగుపై ప్రత్యేక
నిఘా ఉంచుతామని స్పష్టం చేశారు. దీంతో పాటు సాగుచేస్తున్న పంట విక్రయాలపై కూడ దృష్టి సారిస్తామని తెలిపారు. ఎవరైనా గంజాయిని సాగుచేస్తున్నట్లు తెలిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. బుధవారం రచ్చకట్ట తాండాలో చేపట్టిన దాడుల్లో ఎక్సైజ్ ఎస్సై చంద్రకాంత్ రెడ్డి. పోలీస్ సిబ్బంది కిషోర్. రమేష్. మహేష్ .భీమయ్య.తదితరులు పాల్గొన్నారు.

