
మతిస్థిమితం లేని వ్యక్తిపై దాడి..!
– ప్రాణాపాయ స్థితిలో బాధితుడు
– పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంభీకులు
– యాలాల మండలంలో ఆలస్యంగా వెలుగులోకి
తాండూరు, దర్శిని ప్రతినిధి : మతిస్థిమితం సరిగ్గాలేని ఓ వ్యక్తిపై కొందరు మూకుమ్మడి దాడికి పాల్పడ్డాడు. ఒళ్లంతా గాయాలైన బాధితుడు ప్రాణాపాయ పరిస్థితికి చేరుకున్నాడు. యాలాల మండలంలో జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే… యాలాల మండలంలోని అక్కంపల్లి గ్రామానికి చెందిన ఉద్దెర ఆంజనేయులు గత కొన్నేళ్ల నుంచి మతిస్థిమితం కోల్పోయాడు. కొన్నాళ్ల నుంచి అతని భార్య రాములమ్మ, కుమారులు ఆంజనేయులును వదిలి ఆమె తల్లిగారి ఊరు అయిన చెన్నారంకు వెళ్లిపోయింది.

అప్పటి నుంచి ఆంజనె యులు ఇంటి పక్కల వాళ్లు, తెలిసిన వాళ్లు పెట్టింది తింటూ ఉంటున్నాడు. ఆదివారం ఆంజనేయులు ఇంటి వద్ద అరుస్తుండగా వారి ఇంటి ముందు ఉన్న సోమన్ గారి వెంకటమ్మ అనే మహిళ కోపగించుకుంది. దీంతో మతిస్థిమితం లేని ఆంజనేయులు ఆమె తలపై కట్టెతో దాడి చేశాడు. దీంతో వెంకటమ్మ భర్త కిష్ణప్పకు. కుమారులకు తెలిపింది. విషయం తెలుసుకున్న వారు అదేరోజు ఆంజనేయులుపై ఇష్టారాజ్యంగా దాడికి పాల్పడ్డారు. దీంతో ఆంజనేయులు ఒళ్లంతా గాయాలయ్యాయి. సోమవారం ఈ విషయం తెలుసుకున్న భార్య రాములమ్మ గ్రామానికి వచ్చి చూసింది. తాండూరులోని ఓ ప్రవేటు ఆసుపత్రికి చికిత్స కోసం తరలించగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు రిఫర్ చేశారు. ఉస్మానియాకు తరలించగా ఆంజనేయులుకు వాతావరణం పడక మళ్లీ తాండూరుకు తీసుకవచ్చారు.

బుధవారం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ పరిశీలించిన వైద్యులు ఆంజనేయులు పరిస్థితి విషమంగా ఉందని, పేగు సమస్య కారణంగా కడుపు ఉబ్బి పోయిందని వైద్యులు తెలిపినట్లు కుటుంభీకులు తెలిపారు. ఆంజనేయులుకు ప్రాణాపాయం ఉందని చెప్పినట్లు తెలిపారు. గత రెండు రోజుల క్రితమే యాలాల పోలీస్టేషన్లో దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేశారు. గురువారం తాండూరు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆంజనేయులును తాండూరు రూరల్ సీఐ అశోక్ కుమార్, యాలాల ఎస్ఐలు కలిసి జరిగిన సంఘటనపై ఆరా తీశారు.

ఇదికూడా చదవండి…

