యాదిద్రి ఆలయ నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించిన సీఎం కేసీఆర్

తెలంగాణ హైదరాబాద్

యాదిద్రి ఆలయ పునః ప్రారంభానికి ముహూర్తం ఖరారు
– నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించిన సీఎం కేసీఆర్
– స్వామివారి పాదాల చెంత ఆలయ పునఃప్రారంభ ముహూర్త పత్రిక
హైద‌రాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ పుణ్య‌క్షేత్రం యాదిద్రి ఆలయ పునః ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఆలయ పునః ప్రారంభానికి శ్రీశ్రీశ్రీ చిన జీయర్‌ స్వామి ముహూర్తం ఖరారు చేశారు. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం సీఎం కేసీఆర్‌ కేసీఆర్‌ యాదాద్రికి చేరుకుని ఆలయ పునః నిర్మాణ పనులను పరిశీలించారు. ముహూర్తానికి సంబంధించిన పత్రికను రాసిన చిన జీయర్‌ స్వామి సీఎం కేసీఆర్‌కు అందజేశారు. దీంతో కేసీఆర్‌ ముహూర్త పత్రికను స్వామివారి పాదాల చెంతన ఉంచారు. అంత‌కుముందు సీఎం కేసీఆర్ ఏరియల్‌ వ్యూ ద్వారా యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను స‌మీక్షించారు. జరుగుతున్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రధాన ఆలయం, క్యూలైన్లు, శివాలయం, పుష్కరిణిని సందర్శించారు. దీంతో పాటు సీఎం కేసీఆర్ కొండ కింద పూర్తయిన లక్ష్మీ పుష్కరిణి, కల్యాణ కట్ట, టెంపుల్ రింగ్ రోడ్ వెంట తిరుగుతూ, గిరి ప్రదక్షిణ మెట్ల దారి, గోపురం దగ్గర నిర్మాణాలను పరిశీలించి. తుది పనులపై పలు మార్పులు సూచించారు. అనంతరం ఇంటిగ్రేటెడ్ టెంపుల్ సిటీ నిర్మాణ పనులను సీఎం పర్యవేక్షించారు. మొత్తంగా 250 ఎకరాల్లో విస్తరించి ఉండే ఈ టెంపుల్ సిటీలో 50 ఎకరాల్లో పచ్చదనం, మిగతా 200 ఎకరాల్లో 250 కాటేజీల నిర్మాణం జరుగుతుందని సీఎం కేసీఆర్ చెప్పారు. సుమారు 800 నుంచి 1000 గజాల విస్తీర్ణంలో నిర్మించే ఒక్కో కాటేజీలో మొత్తం 4 సూట్లు ఉంటాయన్నారు. దాతల నుంచి విరాళాలు సేకరించిన ధనంతో వైటీడీఏ ఈ కాటేజీలను నిర్మిస్తుందన్నారు. దాతలు సూచించిన పేరును ఆ కాటేజీకి పెట్టుకోవచ్చన్నారు. మొత్తంగా దాదాపు వెయ్యి కుటుంబాలు బస చేసే ఈ సూట్లలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కాటేజీలకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సరిపడా నీళ్లు, నిరంతర విద్యుత్తు, అన్నిరకాల వసతులు, హంగులు సమకూర్చాలని సీఎం ఆదేశించారు. యాదాద్రి పవిత్రతను కాపాడటానికి అందరూ సహకరించాలని, టెంపుల్ సిటీ పరిధిలో మద్యపానం, ధూమపానం నిషేదాన్ని కఠినతరంగా అమలు చేయాలని ఆదేశించారు. ఇక్కడ కేవలం శాఖాహారాన్ని మాత్రమే అనుమతించాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఆలయ ప్రధాన అర్చకులతో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. యాదాద్రిలో 10 వేల మంది రుత్విక్కులతో సుదర్శన హోమం నిర్వహిస్తామని, చిన జీయర్ స్వామి స్వయంగా పర్యవేక్షిస్తారని తెలిపారు.