తాండూరు రోడ్లకు రాజయోగం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరు రోడ్లకు రాజయోగం..!
– రూ.227.8 కోట్లు మంజూరు
– ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక చొరవ
– తీరనున్న తాండూరు – వికారాబాద్‌ రోడ్డు కష్టాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని తాండూరు రోడ్లకు ఎట్టకేలకు రాజయోగం దక్కబోతోంది. నియోజకవర్గంలోని రోడ్ల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం రూ. 227.8 కోట్లను మంజూరు చేస్తూ జీవోలను జారీ చె సింది. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చూపిన ప్రత్యేక చొరవతో రోడ్లకు మహర్దశ కలగబోతోంది. బషీరాబాద్ – కరణ్ కోట్ రోడ్డు(12 కిలోమీటర్లు)కు రూ.30 కోట్లు, మహబూబ్ నగర్- చించొలి మార్గంలోని ఫోర్ వే లైన్(4 కిలోమీటర్లు)కు రూ. 35 కోట్లు, తాండూరు – వికారాబాద్ రోడ్డు(39 కిలో మీటర్లు)కు రూ.101 కోట్లు మంజూరు చేసింది.

అదేవిధంగా నియోజకవర్గంలోని బీటీ రోడ్లకు సీఆర్ఆర్(కన్స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ రోడ్స్) కింద బొంకూరు రుక్మాపూర్ రోడ్డుకు రూ. 156లక్షలు, బండమీదిపల్లి – రొంపల్లి రోడ్డుకు రూ. 177లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్ – రుక్మాపూర్ రైల్వే స్టేషన్ వయా అన్నసాగర్ రోడ్డుకు రూ. 167లక్షలు మంజూరు చేసింది. దీంతో పాటు టెండర్ దశలో ఉన్న రోడ్లకు కూడా నిధులు మంజూరు అయ్యాయి. యాలాల మండలంలోని 9 పనులకు గాను రూ. 15.12 కోట్లు, బషీరాబాద్ మండల పరిధిలోని 4 పనులకు గాను రూ.6.20 కోట్లు, తాండూరు మండల పరిధిలోని 10 పనులకు గాను రూ.16.30 కోట్లు, పెద్దేముల్ మండలంలోని 16 పనులకు గాను రూ.19.18 కోట్లు మంజూరు చేసింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి అధికారిక జీవోల ద్వారా తాండూరులోని రోడ్లకు నిధులు తీసుకరావడం జరిగిందన్నారు. ఇచ్చిన హామీ మేరకు తాండూరు వికారాబాద్ రోడ్డు పనులను పూర్తి చేయడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలోని రోడ్ల పనులన్నింటిని త్వరగా పూర్తి చేయించేలా దృష్టిసారిస్తామన్నారు. తాండూరులోని రోడ్లకు నిధులు మంజూరు కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదికూడా చదవండి…

తల దువ్వినందుకు గుండు కొట్టించాడు..!