మాస్టర్ ప్లాన్ సర్వేలో మంటలు..!
– షాక్ సర్క్యూట్‌తో కాలిపోయిన డ్రోన్
– హైటెన్షన్ విద్యుత్ వైర్లకు తగిలి ప్రమాదం
– కాలిన డ్రోన్ విలువ లక్షల్లో..?
– తాండూరు పట్టణ శివారులో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మాస్టర్ ప్లాన్ సర్వేలో డ్రోన్ మంటల్లో కాలిపోయింది. పైకి ఎగిరిన డ్రోన్ కిందకి వస్తుండగా విద్యుత్ వైర్లకు తగిలి షాక్ సర్య్క్యూట్ కు గురయ్యింది. ఈ సంఘటన మంగళవారం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ 2.0 కింద తాండూరు మున్సిపల్ పరిధిలో మాస్టర్ ప్లాన్ సర్వే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల 1వ తేదిన సర్వే ఆప్ ఇండియా బృందం తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరు సరిహద్దులో డ్రోన్ సర్వే ప్రారంభించారు.
గత నాలుగు రోజులుగా సర్వే నిర్విరామంగా కొనసాగింది. మంగళ వారం, బుధవారాలతో డ్రోన్ సర్వే పూర్తి కావచ్చేది. డ్రోన్ సర్వేలో భాగంగా మంగళవారం హైదరాబాద్ రోడ్డు మార్గం బషీర్ మియా తాండా సమీపంలో రాష్ట్ర అధికారులు, సర్వే ఆఫ్ ఇండియా బృందం సమక్షంలో డ్రోన్ సర్వేకు ఏర్పాట్లు చేసుకున్నారు. సర్వే కోసం డ్రోన్ ను పైకి ఎగిరించగా కొద్ది ఎత్తుకు వెళ్లిన డ్రోన్ సాంకేతిక లోపం వల్ల కిందకి వచ్చింది. డ్రోన్ కిందకు దిగే క్రమంలో హైటెన్షన్ వైర్ల మద్య చిక్కుకుపోయింది.
క్షణాల్లో షాక్ సర్య్కూట్ వచ్చి మంటలు వ్యాపించాయి. మంటలతోనే డ్రోన్ వరి పొలాల మద్య పడిపోయింది. డ్రోన్ మంటలు వరి పొలాలకు అంటుకున్నాయి. స్థానికులు అప్రమత్తమై పంటకు అంటుకున్నమంటలు, డ్రోన్ కు అంటుకున్న మంటలను ఆర్పేశారు. కాలిపోయిన డ్రోన్(విడి భాగాలతో) విలువ సుమారు రూ. 25లక్షలు ఉంటుందని తెలిసింది. ఈ ప్రమాదంపై వివరాలు తెలిపేందుకు బృందం సభ్యులు, అధికారులు నిరాకరించారు. మరో డ్రోన్ ద్వారా సర్వే పూర్తి చేస్తామని బృందం సభ్యులు వెల్లడించారు.
ఇదికూడా చదవండి…

