మృత్యు లారీ..!
– అదుపుతప్పి కూరగాయ వ్యాపారులపైకి
– భీభత్సంలో నలుగురి దుర్మరణం
– రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : కష్టజీవులపై ఓ లారీ మృత్యరూపంలో దూసుకెళ్లింది. అదుపు తప్పి భీభత్సం సృష్టిస్తూ నలుగురి దుర్మరణానికి కారణమైంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు స్టేజి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ -బీజాపుర్ రహదారి పక్కన దాదాపు 50 మంది కూరగాయలు విక్రయిస్తున్నారు. అయితే అదే మార్గంలో హైదరాబాద్‌లో లోడ్ అన్‌లోడ్ చేసి వికారాబాద్ వైపు వస్తున్న లారీ వారిపైకి లారీ దూసుకెళ్లింది.
దూసుకొస్తున్న లారీని చూసి అక్కడి జనమంతా భయంతో పరుగులు తీశారు. వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ చెట్టును ఢీకొట్టి ఆగింది. లారీ సృష్టించిన బీభత్సంలో మృతులను రాములు (ఆలూరు), ప్రేమ్ (ఆలూరు), సుజాత (ఖానాపూర్)గా గుర్తించారు. ఈ ఘటనలో మరికొందరికి గాయాలైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా ప్రమాదానికి కారణమైన లారీలో లారీ డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కొని తీవ్రగాయాలు పాలయ్యాడు.
స్థానికులు అతడిని బయటకు తీసి చికిత్సకోసం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలిస్తున్నారు. దాదాపు వంద మీటర్ల దూరం నుంచే లారీ అదుపు తప్పిన విషయాన్ని గమనించిన కూరగాయల వ్యాపారులు పరుగులు పెట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు కూలిన చెట్టును జేసీబీతో పక్కకు తొలగించారు. మరోవైపు లారీ బీభత్సం సృష్టించిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
ఇదికూడా చదవండి…

