వార్డుకు ఓ ఆఫీసర్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

వార్డుకు ఓ ఆఫీసర్..!
– తాండూరులో పోస్టుల భర్తి
– ప్రజలకు మరింత చెరువగా సేవలు
– స్థానిక సమస్యలు అక్కడే పరిష్కారం
తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపాల్టీలలో పాలనను కొత్త పుంతలను తొక్కించేందుకు అందుబాటులోకి తెచ్చిన వార్డు ఆఫీసర్ల వ్యవస్థ తాండూరు మున్సిపాల్టీలో సంపూర్ణమయ్యింది. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పర్యటించి పరిష్కరించేందుకు వార్డు ఆఫీసర్ల నియామకాలు భర్తీ అయ్యాయి. దీంతో పట్టణ ప్రజలకు మున్సిపాల్టీల సేవలు మరింత చేరువ కానున్నాయి. ప్రజలు మున్సిపల్ కార్యాలయానికి రాకుండానే స్థానికంగానే సమస్యలను పరిష్కరించుకునే వెసులుబాటు కలగనుంది. తెలంగాణలో గత ప్రభుత్వం మున్సిపాల్టీలలో వార్డు ఆఫీసర్ల వ్యవస్థను తీసుకవచ్చింది. ఇందులో భాగంగా తాండూరు మున్సిపల్‌లో కూడా వార్డు ఆఫీసర్లను నియమించారు. తాండూరు మున్సిపాలిటీలోని 36వార్డులకు గాను గతంలో 16వార్డులకు మాత్రమే వార్డు ఆఫీసర్లు నియమించారు. తాజాగా ఖాళీగా ఉన్న 20పోస్టులను భర్తి చేసింది. గ్రూప్‌- 4 కింద వచ్చిన వారిని 20పోస్టులను భర్తీ చేసింది.

అందుబాటులో ఉండే సేవలు ఇలా
వార్డు ఆఫీసర్ల నియామకంతో వార్డుల్లోని ప్రజలకు మెరుగైన సౌకర్యాలు సమకూరే అవకాశం ఉండనుంది. చిన్నచిన్న సమస్యల పరిష్కార విషయమై ప్రజలు మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్లకుండానే రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు వార్డుల్లోనే అందుబాటులో ఉండే వార్డు ఆఫీసర్ల ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఏర్పడుతుంది. వార్డులో ఏ అక్రమ నిర్మాణం జరిగినా వార్డు ఆఫీసర్లకు తెలిసిపోనుంది. అదేవిధంగా ఆస్తి పన్ను, నల్లా పన్ను వసూలులో బకాయిలు కూడా ఉండకుండా వసూలు చేసే బాధ్యత కూడా వార్డు ఆఫీసర్ల మీద ఉంటుంది. వార్డులో డ్రెయినేజీలు పూడి మురుగునీరు రోడ్డుపైకి వస్తే వెంటనే సంబంధిత శానిటరీ ఇన్‌స్పెక్టర్‌కు చెప్పి కార్మికులను రప్పించి వెంటనే సమస్య పరిష్కరించే బాధ్యత కూడా వీరికి అప్పగించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

వార్డుకు సంబంధించిన వీధిలైట్లు, నివాసాల సంఖ్య, ఎంత ఆస్తి పన్ను ఉంది, ఎన్ని నల్లా కనెక్షన్‌లు ఉన్నాయి, బిల్లులు ఎంత వసూలు, డ్రెయినేజీ కాల్వలు, రోడ్లు తదితర పూర్తి సమాచారం ఈ వార్డు ఆఫీసర్ల వద్ద ఉండనుంది. అంతేకాకుండా రోజువారీ పారిశుధ్య కార్యక్రమాల పర్యవేక్షణ, శానిటరీ మాస్టర్స్‌, కార్మికుల పనిని పర్యవేక్షించుట, డోర్‌ టూ డోర్‌ చెత్త సేకరణ, వ్యర్థాల విభజన, ప్లాస్టిక్‌ నిషేదం, వార్డు లేవల్‌ శానిటేషన్‌ ప్లాన్‌ అమలు చేయడం, అంటు వ్యాధుల నివారణ, నియంత్రణకు చర్యలు, ప్రభుత్వ, ప్రైవేటు, మార్కెట్లు, మటన్‌, చికెన్‌ స్టాల్స్‌ స్లాటర్‌హౌస్‌లను చక్కగా శుభ్రంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత వార్డు ఆఫీసర్లపై ఉంటుంది.

ఇదికూడా చదవండి…

విద్యుత్ వాహనాలదే భవిష్యత్తు..!