పేదలకు కోటి ఇళ్లు..!
– పక్కా ఇంటి నిర్మాణంకు ఆర్థిక సాయం
– ఉపయోగపడే కేంద్ర ప్రభుత్వ పథకం
– అర్హతలు, దరఖాస్తులు ఎలా చేసుకోవాలంటే..?
దర్శిని డెస్క్ : కేంద్ర ప్రభుత్వం పేదల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. అందులోని ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్ పేదల పక్కా ఇంటి కలను నిజం చేసుకోవడానికి సహాయపడుతుంది. 2015లో పట్టణ పేదలు, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలో ఇళ్లు నిర్మించే లక్ష్యంతో ఈ స్కీమ్‌ను లాంచ్ చేసింది. 2024 బడ్జెట్లో రాబోయే ఐదు సంవత్సరాలలో 1 కోటి కుటుంబాలకు ఇళ్లు నిర్మించాలనే లక్ష్యంతో రెండో దశ PMAY-U 2.0 ప్రారంభించింది. ఈ స్కీమ్ ప్రయోజనాలు, అర్హత, ఎలా అప్లై చేయాలి? వంటి వివరాలు చూద్దాం.

ఆర్థిక సాయం ఇలా..
మీకు భూమి ఉంటే, ఇల్లు కట్టుకోవడానికి రూ.2.5 లక్షల వరకు ఆర్థిక సహాయం పొందవచ్చు. అదేవిధంగా క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ పథకం (CLSS) ద్వారా, హోమ్ లోన్ వడ్డీపై రూ.2.67 లక్షల వరకు సబ్సిడీ పొందవచ్చు. దీనివల్ల లోన్ల భారం తగ్గుతుంది. మరోవైపు భూమి లేని వారికి, ప్రభుత్వం తక్కువ ధరలకు ఇళ్లను అందిస్తుంది. లేదా చాలా తక్కువ అద్దెకు ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను కేటాయిస్తుంది.

దరఖాస్తు ఇలా..
PMAY-U 2.0 కోసం దరఖాస్తు చేయడానికి అధికారిక PMAY-U పోర్టల్ విజిట్ చేయండి. ‘అప్లై ఫర్ PMAY-U 2.0’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. గైడ్‌లైన్స్ చదవండి, మీ రాష్ట్రం, వార్షిక ఆదాయం, స్కీమ్ కాంపోనెంట్ సెలక్ట్ చేయండి. తర్వాత మీ అర్హతను నిర్ధారించడానికి ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి, మీ ఫోన్‌కు వచ్చే OTPని ఎంటర్ చేసి వెరిఫై చేయండి. అప్లికేషన్ ఫారమ్‌లో మీ పర్సనల్, కుటుంబం, నివాస వివరాలను ఎంటర్ చేయండి. మీ ఇన్కమ్ సర్టిఫికెట్, ఆధార్ నంబర్, ఇతర సంబంధిత డాక్యుమెంట్లు అప్లోడ్ చేయండి. మీ అప్లికేషన్ సేవ్ చేసి, సబ్మిట్ చేయండి. తర్వాత ప్రభుత్వ అధికారులు మీ డాక్యుమెంట్లు సమీక్షిస్తారు. మీరు అర్హులైతే, ఆర్థిక సహాయం నేరుగా మీ బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్స్ఫర్ అవుతుంది.

ఎవరు అప్లై చేసుకోవచ్చు?
ఈ పథకం మూడు ఆదాయ వర్గాలకు ప్రయోజనాలు అందిస్తుంది. PMAY-U 2.0కి భారతదేశంలో ఎక్కడా పక్కా ఇల్లు లేని కుటుంబాలు అర్హులు. మొదట ఆర్థికంగా బలహీన వర్గాలు (EWS), అంటే వార్షిక ఆదాయం రూ.3 లక్షల వరకు ఉండే వాళ్లు అప్లై చేసుకోవచ్చు. రెండోది లోయర్ ఇన్కమ్ గ్రూప్ (LIG), అంటే వార్షిక ఆదాయం రూ.6 లక్షల వరకు ఉండే కుటుంబాలు. చివరిగా మిడిల్ ఇన్కమ్ గ్రూప్ (MIG), వార్షిక ఆదాయం రూ.9 లక్షల వరకు ఉండే వాళ్లు అర్హులు. అయితే మీరు గత 20 సంవత్సరాలలో ఏదైనా కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ గృహనిర్మాణ పథకం నుంచి ప్రయోజనం పొంది ఉంటే, దీనికి దరఖాస్తు చేసుకోలేరు.
వీరికి మొదటి ప్రాధాన్యత
ఈ పథకం కొన్ని సమూహాలకు ప్రాధాన్యత ఇస్తుంది. వితంతువులు, ఒంటరి మహిళలు, లింగమార్పిడి వ్యక్తులు, అలానే వికలాంగులు (దివ్యాంగులు), షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మైనారిటీలకు ప్రాధాన్యం ఉంటుంది. వీధి వ్యాపారులు, మురికివాడల నివాసితులకు కూడా ప్రయారిటీ ఇస్తారు. పీఎం విశ్వకర్మ లేదా PM SWANidhi వంటి పథకాలకు సంబంధించిన వ్యక్తులు, అంగన్వాడీ కార్మికులకు కూడా ప్రయారిటీ ఉంటుంది.

ఇదికూడా చదవండి…

