తాండూరుకు వరద ముప్పు రాకుండా దృష్టి
– కోట్ల నిధులతో చిలుక వాగు ప్రక్షాళన
– పట్టణంలో దశల వారిగా అభివృద్ధి పనులు
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– భారీ వర్షాలతో జాగ్రత్తగా ఉండాలని సూచన
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ప్రాంతంలో ప్రజలకు వరద ముప్పు రాకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని చిలుక వాగుకు వరద నీరు పోటెత్తింది.

మంగళవారం తాండూరు పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కోడంగల్ రోడ్డు మార్గంలో ఉన్న చిలుక వాగును పరిశీలించారు. వాగులో వరద నీరు ప్రవాహా తీరును పరిశీలించారు. అదేవిధంగా చిలుక వాగు బ్రిడ్జీ, కాలువ పనులను పరిశీలించారు. ఆర్ అండ్బి అధికారులతో కలిసి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గత కొన్నేళ్ల నుంచి నానుస్తున్న చిలుక వాగు పనులను ఇటీవల ప్రారంభించడం జరిగిందన్నారు. రెండో దశ పనులను త్వరలో ప్రారంభిస్తామన్నారు.

సుమారు రూ.50 కోట్ల నిధులతో చిలుక వాగు పనులు చేపట్టడం జరుగుతుందని వెల్లడించారు. ఈ వాగు పనులు పూర్తయితే వరద నీరు ముంపు ప్రాంతాలకు ఎలాంటి కష్టాలు ఉండవన్నారు. చిలుక వాగును ప్రక్షాళన చేసి ముంపు ముప్పు సమస్యను పరిష్కరిస్తామన్నారు. అదేవిధంగా పట్టణంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న డ్రైనేజీ పనులు, కాలువల నిర్మాణం పనులు పూర్తి చేసి తాండూరును అభివృద్ధి పరుస్తామన్నారు. అదేవిధంగా భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బంటు వేణు, నాయకులు ఉప్పరి మల్లేశం. ఆర్అండ్ బీ ఏఈ శ్రావణ్, నాయకులు తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

