సేవ చేసిన చేతులతోనే.. సుత్తితో కొట్టి చంపాడు…!
– ఆస్తి ఇవ్వనందుకే మద్యం మత్తులో నేరం
– వీడిన గొట్లపల్లిలో తండ్రి హత్య మిస్టరీ
– కొడుకును రిమాండుకు తరలించిన పోలీసులు
– వివరాలు వెల్లడించిన డీఎస్పీ బాలకృష్ణారెడ్డి
– వీడిన గొట్లపల్లిలో తండ్రి హత్య మిస్టరీ
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : పక్షవాతంతో మంచంపై పడిన తండ్రికి సేవ చేసిన చేతులతోనే సుత్తితో బాధి హత్య చేసిన కొడుకును పోలీసులు కటకటాల్లోకి పంపించారు. ఆస్తి ఇస్తాడనే అత్యాశ నెరవేరడం లేదని దారుణంగా హత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. పెద్దేముల్ మండలం గొట్లపల్లిలో తండ్రిని హత్య చేసిన కోడుకు కేసు మీస్టరీని చేధించారు. గురువారం తాండూరు డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ బాలకృష్ణారెడ్డి రూరల్ సీఐ నగేష్, పెద్దేముల్ ఎస్ఐ వేణు కుమార్‌తో కలిసి కేసు వివరాలను వెల్లడించారు.

గొట్లపల్లికి గ్రామానికి చెందిన తలారి హన్మంతు (70)కు ఐదుగురు కుమారులు. అందరికి పెళ్లిళ్లు అయ్యాయి. తనకున్న 8 ఎకరాల భూమిలో వారికి సమానంగా కొంత భూమిని పంచి పెట్టారు. మూడవ కుమారుడు అయిన రవి భార్య ఐదేళ్ల క్రితం మరణించింది. వీరికి కుమారుడు ఉన్నాడు. భార్య చనిపోయినప్పటి నుంచి రవి మద్యానికి బానిస అయ్యాడు. పక్షవాతానికి గురైన తండ్రి హన్మంతు వద్దే ఉంటున్నాడు. మిగతా అన్నదమ్ములు హన్మంతు బాగోగులు చూడడం.. తనొక్కడినే చూసుకుంటున్నానని కుటుంబీకులతో గొడవపడేవాడు. దీంతో తండ్రిపై ఉన్న భూమిని తన పేరు మీదకు మార్చాలని వాగ్వివాదం పెట్టుకునే వాడు. అయితే హన్మంతు మాత్రం కొడుకు రవి పేరు మీదకు మార్చకుండా మనుమడు పేరు మీదకు మారుస్తానని చెప్పేవాడు.

ఓ వైపు మద్యానికి బానిసైన రవి తండ్రికి సేవ చేసినా భూమి ఇవ్వడం లేదని, ఎలాగైనా భూమి దక్కించుకోవాలని దురాశకు సిద్దపడ్డాడు. ఇదే విషయంపై మంగళవారం ఇంట్లో గొడవ జరగగా రవి తల్లి నర్సమ్మపై దాడి చేశాడు. దీంతో ఆమె చికిత్స కోసం తాండూరు ఆసుపత్రికి వెళ్లింది. బుధవారం మధ్యాహ్నం మద్యం మత్తులో ఉన్న రవి ఇంట్లో ఉన్న తండ్రిపై సుత్తితో కణతల భాగంలో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం డయల్ 100కు కాల్ చేసి తన తండ్రిని హత్య చేసినట్లు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న పెద్దేముల్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు రవిపై నిఘా ఉంచి గురువారం అదపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో రవి తండ్రిని హత్య చేసినట్లు అంగీకరించాడు. దీంతో నిందితుడు రవిని రిమాండుకు తరలించినట్లు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి వెల్లడించారు. కేసు విచారణలో పనిచేసిన ఎస్ఐ, సిబ్బందికి అభినందనలు తెలిపారు.

ఇదికూడా చదవండి..

