యూరియా కోసం ఎగబడ్డారు..!
– వేకువ జామునొస్తే.. ఒక్క బస్తా ఇస్తారా..
– తాండూరు ప్రాంతంలో రైతుల ఆవేధన
– ఎల్మకన్నె పీఏసీఎస్ వద్ద ఉద్రిక్తత
– పోలీసుల పహారా మద్య టోకన్ల జారీ
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ఒక్కటే.. యూరియా బస్తా కోసమా.. వేకువ జామునుంచి బారులు తీరిందీ.. అని తాండూరు ప్రాంతంలోని రైతులు అసహనం వ్యక్తం చేశారు. సోమవారం తాండూరు పట్టణ సమీపంలో కొనసాగుతున్న ఎల్మకన్నె సహాకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు.

ఉదయం 6 గంటలకే కార్యాలయం వద్ద పడిగాపుల కాయడంతో రైతుల యూరియా కష్టాలు కనిపించాయి. యూరియా బస్తాలు తీసుకునేందుకు రైతులు బారులు తీరారు. కార్యాలయం తెరువక ముందే రైతులతో ప్రాంగణం కిక్కిరిసి పోయింది. కార్యాలయం తెరిచిన తరువాత రైతులు యూరియా బస్తాలు పొందేందుకు ఎగబడ్డారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. విషయం తెలుసుకున్న తాండూరు పట్టణ పోలీసులు పీఏసీఎస్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కార్యాలయంలో 230 బస్తాలే ఉండడంతో అందరికి పంపిణీ చేయాలని ప్రయత్నించారు. బారులు తీరిన రైతులకు టోకన్ల విధానంలో పంపిణీ చేయాలని నిర్ణయించారు.

పోలీసుల పహారాలో క్యూలో వచ్చిన రైతులకు టోకన్లు అందించి.. ఒక్కో రైతుకు ఒక్కో బస్తాను పంపిణీ చేశారు. మిగతా రైతులకు టోకన్లు వచ్చి రేపు రావాలని పంపించారు. యూరియా బస్తాలు పొందిన రైతులు మాత్రం వేకువ జాము నుంచి బారులు తీరితే.. ఒక్కటే బస్తా అందించడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రతి రైతుకు 4 నుంచి 5 యూరియా బస్తాల అవసరం ఉందని, అందుకు అనుగుణంగా అందించేలా చూడాలని కోరారు. మరోవైపు రైతులకు ఎలాంటి ఇబ్బందులు రావద్దని వ్యవసాయ శాఖ ఏడిఏ కొమురయ్య కార్యాలయం వద్దకు చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, మరో 30 టన్నుల యూరియా వస్తోందని, అందరికి యూరియా బస్తాలు అందించేలా చూస్తామని భరోసా ఇవ్వడంతో రైతులు శాంతించారు. పీఏసీఎస్ కార్యాలయం వద్ద రైతులు బారులు తీయడం యూరియా కోసం నీరిక్షించడం వారి కష్టాలు కనిపించాయి.

ఇదికూడా చదవండి…

