ఏం.. తాగి.. నడిపావ్.. రా..!
– మద్యం మత్తులో ట్రాక్టర్ డ్రైవర్ భీభత్సం
– రోడ్డుపై ర్యాష్ డ్రైవింగ్‌తో హల్ చల్
– బైకులను ఢీ కొడుతూ షాపులోకి దూసుకెళ్లిన వైనం
– తాండూరు మండలం గౌతాపూర్ వద్ద ఘటన
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ఏం తాగి.. నడిపావ్.. రా.. బాబూ అంటూ ఓ ట్రాక్టర్ డ్రైవర్‌ను ప్రజలు తిట్టిపోశారు. మద్యం మత్తులో ఉన్న ట్రాక్టర్ డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ భీభత్సం సృష్టించాడు. రోడ్డు పక్కనే ఉన్న బైకులను ఢీ కొడుతూ ఓ షాపులోకి దూసుకెళ్లాడు. అదృష్ట వశాత్తు ఈ భీభత్సంలో ఎవ్వరికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

ఈ సంఘటన సోమవారం తాండూరు మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు మండలం ఓగిపూర్ గనుల్లో నుంచి ట్రాక్టర్(టీఎస్ 34 టీఏ 6431) ట్రాలీ (ఏపీ 07 టీఏ 1763)తో డ్రైవర్ నాపరాతి లోడ్ తో తాండూరు వైపు వస్తున్నాడు. అప్పటికే పుల్ మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ ఇష్టం వచ్చినట్లుగా ట్రాక్టర్ ను నడిపించుకుంటూ వస్తున్నాడు. మార్గమద్యలోని గౌతాపూర్ వద్దకు రాగానే పూర్తిగా సృహ కోల్పోయి రోడ్డు పక్కనే ఉన్న బైకులను ఢీ కొడుతూ హల్ చల్ చేశాడు.

అదే దూకుడుతో నడిపిస్తూ ముందు ఉన్న దుకాణాలపైకి దూసుకెళ్లి.. భీభత్సం సృష్టించాడు. ట్రాక్టర్ డ్రైవర్ భీభత్సం వల్ల స్థానికులు హడలెత్తిపోయారు. ట్రాక్టర్ మీదకు వస్తుండగా స్థానికులు చిన్నారులను. పలువురును కాపాడారు. అదుపుతప్పిన ట్రాక్టర్ దుకాణంలోకి దూసుకెళ్లి ఆగిపోయింది. విషయం తెలుసుకున్న కరణ్ కోట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను అడిగి తెలుసుకున్నారు. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. దుకాణాల మద్య ఉన్న ట్రాక్టర్ ను జేసీబీ ద్వారా పక్కకు తొలగించి కరణ్ కోట్ పోలీస్టేషన్ కు తరలించారు. ఈ సంఘటనలో ఎవ్వరికి ఎలాంటి నష్టం, ప్రమాదం జరగకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.

ఇదికూడా చదవండి…

