రోడ్లకు డబ్బుల్లేవ్..!
– దివాలా తీసిన కాంగ్రెస్ సర్కారు
– ఆర్టీసీ మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం
– వారంలో కేంద్రం నుంచి మృతుల పరిహారం
– హాజీపూర్ అమ్మాయిని నర్సింగ్ చదిస్తాం
– చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
– ఒక్కొరికి రూ. 30వేల ఆర్థిక సాయం అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వద్ద రోడ్లు వేసేందుకు కూడా డబ్బులు లేనంతగా దివాలా తీసిందని చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఈనెల 3న చేవేళ్ల మండలం మీర్జాగూడ వద్ద కంకర టిప్పర్ లారీ ఆర్టీసీ బస్సును ఢీ కొనడంతో వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన సలేహా, ఖాలిద్, రెండు నెలల చిన్నారితో పాటు, పట్టణంలోని విశ్వంబర కాలనీకి చెందిన తబస్సుమ్, వాల్మీకీనగర్కు చెందిన వెంకటమ్మ, పాత తాండూరుకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ దస్తగిరి బాబ, తాండూరు మండలం గౌతాపూర్ గ్రామానికి చెందిన ముస్కాన్ భేగం, యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ కు చెందిన అఖిల రెడ్డి, హాజీపూర్ గ్రామానికి చెందిన భార్యా భర్తలు లక్ష్మీ, బందెప్ప, పేర్కంపల్లికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్లు తమాషా, సాయిప్రియ, నందిని మొత్తం 13 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.

ఆదివారం చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తాండూరు నియోజకవర్గంలో మృతుల కుటుంబాలను పరామర్శించారు. తన సొంత ఖర్చుల నుంచి ఒక్కొక్కరికి రూ. 30వేల చొప్పున ఆర్థిక చేయూతను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రోడ్ల దుస్థితి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. గత ప్రభుత్వం డబ్బులన్నీ దోచుకుపోవడంతో ప్రస్తుత ప్రభుత్వం వద్ద రోడ్లు వేసేందుకు కూడా డబ్బులు లేదని, పూర్తిగా దివాలా తీసిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వమే రోడ్ల ఇనర్మాణం చేస్తుందని అన్నారు. త్వరలో రూ.60 కోట్ల నిధులను రోడ్ల నిర్మాణంకు మంజూరు చేయబోతుందని తెలిపారు. అదేవిధంగా మన్నెగూడ మార్గంలో నిర్మించాల్సిన నేషనల్ హైవేపై ఉన్న మలుపులు ప్రమాదకరంగా ఉండడంతో వంపులు లేకుండా నిర్మించేందుకు కృషి చేస్తానని అన్నారు. అదేవిధంగా కేంద్రం నుంచి రూ. 2లక్షల పరిహారం వారంలో మృతుల కుటుంబాలకు ఇప్పించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. బాధిత కుటుంబాలకు కూడా న్యాయం జరిగేలా చూస్తామన్నారు.

మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం
చేవేళ్ల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు అండగా ఉంటామని ఎంపీ కొండా అన్నారు. యాలాల మండలం లక్ష్మీనారాయణ పూర్ గ్రామానికి చెందిన అఖిల రెడ్డి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించేందుకు కృషి చేస్తానని అన్నారు. అదేవిధంగా హాజీపూర్ గ్రామానికి చెందిన బందెప్ప. లక్ష్మీల ఇద్దరు కూతుళ్లలో పెద్ద కూతురును నర్సింగ్ చదివించడమే కాకుండా ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు. వారిద్దరిని హైదరాబాద్ లో అనాథ ఆశ్రమంలో చేర్పించేందుకు చొరవ చూపుతామన్నారు. ఆయన వెంట బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

