పైపు లైన్‌లో పాపపు సొమ్ము
– నోట్ల కట్టలు కుక్కిన అవినీతి అధికారి
– అవాక్కైన అధికారులు.. ఎక్కడంటే..?
దర్శిని బ్యూరో: అడ్డదారిలో.. అక్రమంగా సంపాదించిన పాపపు సొమ్మును పైపులైన్‌లో దాచిన అవినీతి అధికారి గుట్టును రట్టుచేశారు ఏసీబీ అధికారులు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై వివిధ శాఖలకు చెందిన 15 మంది ప్రభుత్వ అధికారులను లక్ష్యంగా చేసుకుని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బుధవారం కర్ణాటక వ్యాప్తంగా 60 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. 8 మంది ఎస్పీలు, 100 మంది అధికారులు, 300 మంది సిబ్బందితో కూడిన బృందం 15 మంది అధికారుల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేసి సోదాలు నిర్వహించారు. కర్ణాటకకు చెందిన ప్రభుత్వ అధికారులు మంగళూరుకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.ఎస్.లింగేగౌడ, మండ్యకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్.కె., దొడ్బళ్లాపూర్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనరశిమయ్య, బెంగళూరుకు చెందిన మాజీ ప్రాజెక్ట్ మేనేజర్ వాసుదేవ్, బెంగళూరుకు చెందిన జనరల్ మేనేజర్ బి.కృష్ణారెడ్డి, జాయింట్ డైరెక్టర్ టి.ఎస్.రుద్రేశప్ప గడగ్‌కు చెందిన 15 మంది అధికారులపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది.
ఈ క్రమంలోనే కలబురగి జిల్లాలోని పీడబ్ల్యూడీ జూనియర్ ఇంజనీర్ శాంతగౌడ బిరాదార్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. అయితే, తన అక్రమ సంపాదనంతా ఇంట్లోని నీటి పైపులో దాచినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ప్లంబర్ సహాయంతో కరెన్సీ నోట్లను బయటకు తీశారు ఏసీబీ అధికారులు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.25లక్షలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి వీడియో ఒకటి ఏసీబీ అధికారులు రిలీజ్ చేయడంతో వైరల్‌గా మారింది. ఏసీబీ అధికారులు పోస్ట్ చేసిన ట్వీటర్ వీడియోలో అధికారులు పైప్‌లైన్ నుండి కరెన్సీ నోట్లను రికవరీ చేస్తున్నట్లు కనిపించింది.
