కాంగ్రెస్ ప్రతిష్ట పెంచేలా పాలన

తాండూరు రాజకీయం వికారాబాద్

కాంగ్రెస్ ప్రతిష్ట పెంచేలా పాలన
– కొత్త సర్పంచులకు సర్కారు సంపూర్ణ అండ
– ఇచ్చిన హామీలను అమలు చేయండి
– తాండూరులో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– జిల్లా ఇంచార్జ్ మంత్రి సమక్షంలో సర్పంచులకు సన్మానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ట పెంచేలా సర్పంచులు పాలన చేపట్టాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులకు ఆదివారం సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. శంషాబాద్ పట్టణంలో జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో సర్పంచులకు ఘనంగా సన్మానం నిర్వహించారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన సర్పంచులను కూడా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలో 25 స్థానాలు ఏకగ్రీవం కావడం అభినందనీయమన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో గెలుపొందిన సర్పంచులు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వ ప్రతిష్ట పెంచేలా పాలన చేయాలని అన్నారు. గ్రామాల్లో ప్రజలకు ఇచ్చిన హామిలను అన్ని నెరవేర్చాలన్నారు. గత రెండేళ్లు గ్రామాల్లో పాలక వర్గాలు లేక, చేసిన పనులకు బిల్లులకు రాక పోవడంతో పాలన కుంటుపడిందని అన్నారు. రెండేళ్లుగా నిలిచిపోయిన ఆర్థిక సంఘం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయబోతున్నాయని అన్నారు. గ్రామాల పురోగతికి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. సర్పంచులు గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. మెరుగైన పనితీరుతో మరోసారి అధికారంలోకి రావడానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్, జిల్లా, రాష్ట్ర నాయకులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

రామ మందిర దాతల ఉదారత..!