బోనమ్మ వైభోగం..!

తాండూరు వికారాబాద్

బోనమ్మ వైభోగం..!
– ఘనంగా బోనాల పండగ
– రేపు రాత్రి రథోత్సవ వేడుక
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు పట్టణ భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతూ.. పాత తాండూరులో వెలసిన శ్రీ బోనమ్మ (భవానిమాత) జాతర ఉత్సవాలు ఆదివారం వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు.
జాతర ఉత్సవాలను పురస్కరించుకుని ఆల‌యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర సందర్భంగా ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు అధిక సంఖ్యంలో తరలివచ్చారు. అదేవిధంగా జాతర వేడుకలను పురస్కరించుకుని మ‌హిళ భక్తులు బోనాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. పలు వీధుల గుండా బోనాల ఊరేగింపు కమణీయంగా కొనసాగింది.
బోనాలతో ఆలయం చుట్టు ప్రదక్షణలు చేసి, నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ బోనాల ఊరేగింపు కార్యక్రమం ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగింది. అదేవిధంగా పట్టణ భక్తులు, పలువురు ప్రముఖులు జాతర వేడుకల్లో పాల్గొని అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నారు.

జాతర ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మున్సిపల్ అధికారులు తగు ఏర్పాట్లు చేశారు. అదే విధంగా జాతర వేడుకల్లో అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మరోవైపు జాతర ఉత్సవాల్లో భాగంగా రేపు సోమవారం రథోత్సవం నిర్వ వాస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.