ఆర్టీసీ రక్తదాన శిబిరానికి స్పందన
– శుభాకాంక్షలు తెలిపిన డీఎం రాజశేఖర్
తాండూరు, దర్శిని ప్రతినిధి: ప్రయాణికులకు సురక్షిత సేవలను అందించడంలో గుర్తింపు పొందిన ఆర్టీసీ సామాజిక సేవా కార్యక్రమాలలో భాగం పంచుకుంటోంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారితో పాటు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న రోడులను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్రంలో ని అన్ని ఆర్టీసీ డీపోల్లో మంగళవారం రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఆదేశాల మేరకు తాండూరు ఆర్టీసీ డీపోలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి మంచి స్పందన లభించింది. డీఎం రాజశేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరాన్ని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వాణి, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ ఆనంద్ గోపాల్ రెడ్డిలు ప్రారంభించారు. జిల్లా ఆసుపత్రి రక్తనిధి కేంద్రం వైద్య సిబ్బంది సహాకారంతో రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా కొనసాగించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగిన శిబిరంలో దాదాపు 27 మంది పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా డీఎం రాజశేఖర్ మాట్లాడుతూ ఆర్టీసీ పిలుపునిచ్చిన రక్తదాన శిబిరానికి స్పందించి రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా రక్తదానం చేసిన దాతలకు వారు గమ్య స్థానాలకు చేరేందుకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సోమ్లా, హెడ్ క్లార్క్ వెంకటేశ్వర్లు, ఏఎంఎఫ్ సాధిక్, నవీన్, రవి సింగ్, శ్యామ్ సుందర్ రెడ్డి, బస్వరాజు, బాలప్ప, పి.సి.శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
