ఆర్టీసీలో ఆధార్ కార్డుకు చెల్లు..!
– త్వరలో మహిళలకు కొత్త కార్డులు
– కసరత్తు చేస్తున్న ఆర్టీసీ సంస్థ
– కొత్త మార్పుకు కారణాలు ఇవే..
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళల అందరికి మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తోంది. ఆధార్ కార్డు ఉన్న మహిళలకు ఈ సదుపాయం కల్పిస్తోంది.

అయితే త్వరలో ఆధార్ కార్డును తొలగించి దాని స్థానంలో కొత్త కార్డులను పంపిణీ చేయాలని ఆర్టీసీ సంస్థ నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకవెళ్లింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం కింద స్మార్ట్ కార్డులు జారీ చేసేందుకు ఆర్టీసీ కసరత్తు చేస్తోంది.
మార్పు వెనుక కారణాలు ఇవే..
ప్రభుత్వం ప్రస్తుతం ఆధార్ కార్డు ఆధారంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తోంది.

అయితే ఇతర రాష్ట్రాలకు చెందిన కొందరు మహిళలు నకిలీ ఆధార్ కార్డులతో ఈ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. దీనిని అరికట్టేందుకు స్మార్ట్ కార్డులను పంపిణీ చేయాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.
త్వరలో ఉచిత స్మార్ట్ కార్డులు
ఇప్పుడు ఆధార్ కార్డు ప్రమాణికంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని ఎలా అనుమతిస్తున్నారో.. ఈ కార్డులు జారీ చేసిన తర్వాత స్మార్ట్ కార్డుల ఆధారంగా ఉచిత ప్రయాణాన్ని అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు.

అంటే వీటి జారీ తర్వాత కేవలం స్మార్ట్ కార్డులు ఉన్న మహిళలకు మాత్రమే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఉండొచ్చని తెలుస్తోంది. వచ్చే నెల నుంచే ఈ స్మార్ట్ కార్డులను జారీ చేయనున్నట్టు ఆర్టీసీ ఎండి తెలిపారు. ఈ స్మార్ట్ కార్డుల ద్వారా టికెట్ జారీ ప్రక్రియ మరింత సులభతరం అవుతుందని ఆయన తెలిపారు. అయితే ఈ స్మార్ట్ కార్డుల జారీ విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని.. వీటి కోసం మూడు నమూనాలను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపామని.. వాటిలో ప్రభుత్వం ఒక నామునాను ఖరారు చేసినట్టు తెలిపారు.


