కలహాలు మాని కలిసి సాగండి..!
– వర్గపోరుతోనే కుంటుపడిన అభివృద్ధి
– చైర్ పర్సన్ ఒప్పందం అధిష్టాన నిర్ణయం
– మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : కలహాలు మాని కలిసి సాగితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని.. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వర్గాలతో ఉంటే అభివృద్ధి కుంటుపడుతుందని తాండూరు: బీఆర్ఎస్ నేతలు అన్నారు. శనివారం ఎమ్మెల్సీ ముహేందర్ రెడ్డి నివాసంలో బీఆర్ఎస్ నేతలు మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, సాయిపూర్ బాల్ రెడ్డి, తాటికొండ పరిమళ్ గుప్త, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, కౌన్సిలర్ బోయరవి తదితరులు మీడియాతో మాట్లాడారు. తాండూరు మున్సిపల్ పాలక వర్గంలో వర్గాల పేరుతో పట్టణ అభివృద్ధి వెనుకబడుతుందన్నారు. మూడేళ్లుగా కౌన్సిలర్లు వార్డులను అభివృద్ధి చేసుకోలేకపోతున్నారని అన్నారు. వర్గాల పేరుతో మాది పైచేయి… అంటూ.. కాదు మాదే పైచేయి అంటూ స్వపక్షంలోనే విపక్ష విమర్శలు సాగుతున్నాయన్నారు. వర్గాల కారణంగా ప్రజలకు తాగునీరు అందించని పరిస్థితి, వీధి దీపాలను ఏర్పాటు చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. వీటన్నింటిని పక్కన పెట్టి అభివృద్ధిలో ముందుకు సాగాలన్నారు. మున్సిపల్ అభివృద్ధిలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల పాత్ర ఎంతైనా అవసరముందని.. మున్సిపల్లో అధికారుల నియామకాలు, వార్డులకు నిధుల మంజూరుపై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల వద్దకు వెళ్లి సాధించుకుందామన్నారు. నమ్మకంతో గెలిపించిన ప్రజల ఆశలను నెరవేర్చేందుకు పాటుపడాలన్నారు. వర్గాల వివాదాల కారణంగా కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు కూడ అభివృద్ధి చేయలేకపోతున్నారని అన్నారు. పట్టణంలోని ప్రతి వార్డులో పార్టీలకతీతంగా కౌన్సిలర్లు కలిసి సాగాలని, సమావేశాలు ఏర్పాటు చేసుకుని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. వీళ్లు దొంగలు, వాళ్లే దొంగలు అంటూ విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవడం మంచిది కాదన్నారు. గెలిచామని, ఓడమని బేధాభిప్రాయాలను పక్కన పెట్టి.. మున్సిపల్లో ఉన్న నిధులతో పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరముందన్నారు. ఈ విషయాలలో నేతలు జోక్యం చేసుకోరాదని, వీలైతే వివాదాలను సరిదిద్దే ప్రయత్నం చేయాలన్నారు. ఆదేవిధంగా చైర్ పర్సన్ కుర్చీపై రెండున్నరేళ్ల ఒప్పందంపై అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందన్నారు. దీనిని సాకుగా చేసుకుని వర్గపోరును కొనసాగించడం మంచిది కాదన్నారు. అందరు కలిసి సాగితేనే తాండూరు అభివృద్ధి సాధిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ వెంకన్న గౌడ్, బీఆర్ఎస్‌వై రాష్ట్ర నాయకులు నిర్కర్ రఘు తదితరులు పాల్గొన్నారు.

