మున్సిపల్ చైర్ పర్సన్‌కు ప్రజా సంఘాల సత్కారం
– వైస్ చైర్మన్‌ను సన్మానించిన నేతలు
– ప్రజా సమస్యలు పరిష్కరించాలని వినతి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్‌లను స్థానిక ప్రజా సంఘాల నాయకులు ఘనంగా సన్మానం నిర్వహించారు.

మంగళవారం ప్రజా సంఘాలు సీఐటీయూ, తెలంగాణ మైనార్టీ హక్కుల పోరాట సమితి, ఎమ్మార్పీఎస్, కేవీసీఎస్, కురువ సంఘం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హక్కుల పోరాట సమితి, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సత్కరించారు. ముందుగా చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి దంపతులను, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్‌లకు శాలువా, పూలమాల వేసి సత్కరించారు. అనంతరం తాండూరు పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రతి వార్డులో త్రాగునీరు, విద్యుత్ దీపాలు, డ్రైనేజీ, మున్సిపల్ పార్కుల పరిరక్షణ, మున్సిపల్ కార్మికులకు జీవో 60 ప్రకారం కనీస వేతనం అమలు చేయాలని, జనాభాకు అనుగుణంగా మున్సిపల్ కార్మికులకు పని భారాన్ని తగ్గించి కొత్తవారిని తీసుకోవాలని, మున్సిపల్ కార్మికుల చనిపోయిన వారి కుటుంబంలో కొత్తవారిని తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి కే శ్రీనివాస్, తెలంగాణ మైనార్టీ హక్కుల పోరాట సమితి తాండూరు నియోజకవర్గ ఇంచార్జీ ఎండి సాదిక్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు కే చంద్రయ్య, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఉప్పల్ మల్కయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు యు. బుగ్గప్ప, ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్ష బలరాం, సిహెచ్ రవికుమార్, ఎంహెచ్‌పీఎస్ తాండూరు మండల నాయకులు ఎండి మగ్దుమ్ వాసే, ఎండీ సమీద్దీన్, సీఐటీయూ తాండూరు మండల కన్వీనర్ జైపాల్, మున్సిపల్ కార్మికుల వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్, శ్రీకాంత్, వై. రాములు, రఘుపతి, ప్రకాష్, తానేష్, ఎం. ఎల్లప్ప, రాజు, కురువ సంఘం అధ్యక్షులు జై బాలప్ప తదితరులు పాల్గొన్నారు.


