రేపు, ఎల్లుండి తాగునీటి సరఫరా బంద్
– మిషన్ భగీరథ పైపులైన్ అనుసంధాన పనుల కారణంగా నిర్ణయం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలో రేపు, ఎల్లుండి తాగునీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. గత కొన్ని నెలల నుంచి తాండూరు పట్టణంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పలు వార్డుల్లో ఇప్పటికే కుళాయి కనెక్షన్లు అమర్చారు. దీంతో పాటు తాగునీటి సరఫరా పైపులైన్ పనులకు అనుసంధాన పనులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాన పైపులైన్ అనుసంధాన పనులను దృష్టిలో ఉంచుకుని తాగునీటి సరఫరాకు అంతరాయం విధిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ కారణంగా తాండూరు పట్టణంలో శనివారం, ఆదివారం తాగునీటి సరఫరా ఉండబోదని ప్రకటనలో తెలిపారు. తాగునీటి సరఫరా అంతరాయాన్ని గమనించి పట్టణ ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
