తాండూరు రోడ్ల పురోగతికి ప్రాధాన్యం ఇవ్వండి
– రహదారుల కోసం నిధులు మంజూరు చేయాలి
– బైపాస్ రోడ్డు పరిహారం అందించేలా చూడండి
– అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గళం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలోని రోడ్ల పురోగతికి ప్రాధాన్యం ఇచ్చేలా చూడాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కోరారు.

మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు రోడ్లపై గళం విప్పారు. తాండూరు నియోజకవర్గంలో రోడ్లు ఆధ్వాన్న స్థితిలో ఉండడంతో ప్రజలు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తాండూరు – కోట్‌పల్లి రోడ్డు, తాండూరు-తట్టెపల్లి- తోర్మామిడి రోడ్డు, మారేపల్లి-మదనంతాపూర్ రోడ్డు, బుద్దారం-నాగులపల్లి రోడ్డు, లక్ష్మీనారాయణపూర్-దేవనూర్ రోడ్డు పనుల పురోగతికి నిధులు మంజూరు చేయాలని కోరారు.

ముఖ్యంగా కోకట్ బ్రిడ్జి సమస్య వల్ల రాకపోకలకు అవస్థలు ఏర్పడుతున్నాయని తెలిపారు. సమస్య పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపించాలని కోరారు. అదేవిధంగా రోడ్లపై ఉన్న ఎలక్ట్రిక్ స్థంబాల తొలగింపులు ఆయా శాఖల అధికారుల మద్య సమన్వయలోపం ఏర్పడిందని తెలిపారు. మరోవైపు తాండూరులో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బైపాస్ రోడ్డుకు చిక్కులు తొలగడం లేదని సభా దృష్టికి తెచ్చారు. బైపాస్ రోడ్డు కోసం రూ. 25 కోట్ల పరిహారం రావాల్సి ఉందని, పరిహారం అందక పోవడంతో భూముల రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఇందుకు ఆర్అండ్‌బీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పందిస్తూ తాండూరులోని పలు రోడ్ల నిర్మాణాలకు సుమారు రూ. 287 కోట్లతో టెండర్లు ఆహ్వానించడం జరుగుతుందని, త్వరలోనే రోడ్ల సమస్యలను పరిష్కరిస్తామని బదులిచ్చారు.


