యాసంగి సాయం దూరమే..!
– మండల కార్యాలయాల్లోనే కొత్త దరఖాస్తులు
– జిల్లాలో 3 వేల మందికి రైతుబంధు లేనట్లే
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతు బంధు సాయానికి కొత్త రైతులు దూరం అయ్యారు. దీంతో పంటల సాగు పెట్టుబడిపై ఆశలు వదులుకునే పరిస్ధితి ఏర్పడింది. కొత్త రైతుల నుంచి అధికారులు స్వీకరించిన దరఖాస్తులు మండల కార్యాలయాలలో ఉండిపోయాయి. రైతు బంధు పథకాన్ని ప్రవేశ పెట్టిన నాటి నుంచి ప్రభుత్వం ఖరీఫ్, రబీ సీజన్లలో పంటల సాగు పెట్టుబడి కోసం రూ. 10వేల ఆర్థిక సహాయం అందిస్తోంది. రెండు సీజన్లకు సంబంధించి రూ. 5 వేల చొప్పున రైతుల ఖాతాలలో జమచేస్తోంది.
అయితే రైతు బంధు సాయం కోసం కొత్తగా పట్టా పాసు పుస్తకాలు పొందిన రైతుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేరకు జిల్లాలోని 99 వ్యవసాయ క్లస్టర్ల నుంచి దాదాపు 3వేల మంది రైతులు రైతు బంధు సాయానికి దరఖాస్తులు చేసుకున్నారు. రైతు బంధు సహాయం దరఖాస్తులను జిల్లా వ్యవసాయ అధికారులు ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. కాని ఈ యాసంగిలో రైతుల దరఖాస్తులపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ కారణంగా కొత్తగా రైతులు చేసుకున్న దరఖాస్తులు మండల కార్యాలయాలలో పెండింగ్‌లో ఉండిపోయాయి. దీంతో రైతు బంధు సహాయానికి రైతుల పేర్లు నమోదు కాకపోవడంతో కొత్త రైతులు యాసంగి సాయానికి దూరమయ్యారు. ప్రభుత్వం నుంచి పెట్టుబడి రాకపోవడంతో పంటల సాగుకు సహాయం కోసం ఇతర ఏర్పాట్లు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
