వీఆర్ఏల కుటుంబాలను ఆదుకోవాలి
– తాండూరు తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేత
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : వీఆర్ఏల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. పే-స్కేల్, పీఆర్సీ జీఓ విడుదలలో ఆలస్యం, వీఆర్ఏల ఆత్మహత్యలకు నిరసనగా వీఆర్ఏల సంఘం రాష్ట్ర కమిటి పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా తాండూరు మండల వీఆర్ఏలు నల్ల బ్యాడ్జిలు ధరించి గురువారం సంఘం ఆధ్వర్యంలో తాండూరు తహసీల్దార్ చిన్నప్పల నాయుడుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెరగక, చేసిన అప్పులు తీర్చే మార్గం లేక రాష్ట్రంలో వీఆర్ఏలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వం వీఆర్ఏలకు ప్రకటించిన పే-స్కేల్, వారసులకు ఉద్యోగం హామిలను ఇప్పటి వరకు అమలు చేయడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇచ్చిన హామిలను నెరవేర్చాలన్నారు. హామిల సాధన కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టేందుకు సిద్దమవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటి సహ అధ్యక్షులు అమీరోద్దీన్, నాయకులు అంజిలప్ప, మండల అధ్యక్షులు చెంద్రప్ప, నర్సప్ప, మున్యప్ప తదితరులు పాల్గొన్నారు.
