ఇసుక మాఫీయాకు టాస్క్‌ఫొర్స్ క‌ళ్లెం

క్రైం తాండూరు వికారాబాద్

ఇసుక మాఫీయాకు టాస్క్‌ఫొర్స్ క‌ళ్లెం
– అక్రమంగా ఇసుక త‌ర‌లిస్తున్న ట్రాక్ట‌ర్ల‌పై ఉక్కుపాదం
– ఆరు ట్రాక్ట‌ర్ల‌ను సీజ్ చేసి పోలీసుల‌కు అప్ప‌గింత‌
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరులో రెచ్చిపోతున్న ఇసుక మాఫీయాకు వికారాబాద్ జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసులు క‌ళ్లెం వేశారు. గ‌త కొన్ని రోజుల నుంచి తాండూరు ప్రాంతంలో ఇసుక మాఫీయా అక్ర‌మ దందాకు పాల్ప‌డుతోంది. అర్ద‌రాత్రి దాటిన త‌రువాతే ఇష్టారాజ్యంగా అక్ర‌మ ఇసుక రవాణా చేస్తున్నారు. తాండూరు మున్సిప‌ల్ పరిధి పాత తాండూరు కాగ్నా వాగునుంచి ఎలాంటి అనుమ‌తి ప‌త్రాలు లేకుండా ఇసుక‌ను త‌ర‌లిస్తూ అక్ర‌మార్జ‌న సాగిస్తున్నారు. అక్ర‌మ ఇసుక ర‌వాణాపై తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు రావ‌డంతో వికారాబాద్ జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిఘా ఉంచారు. ఈ మేర‌కు గురువారం అర్ద‌రాత్రి దాడులకు సిద్ద‌మ‌య్యారు. పాత తాండూరు కాగ్నా న‌ది నుంచి అక్ర‌మంగా ఇసుక త‌ర‌లిస్తున్న ఆరు ట్రాక్ట‌ర్ల‌ను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.

ర‌వాణ‌కు సంబంధించి ఎలాంటి అనుమ‌తి ప‌త్రాలు లేక‌పోవ‌డంతో ట్రాక్ట‌ర్ల‌ను, ఆరు మంది డ్రైవ‌ర్ల‌ను అదుపులోకి తీసుకున్నారు. ప‌ట్టుకున్న‌ట్రాక్ట‌ర్ల‌ను, డ్రైవ‌ర్ల‌ను తాండూరు ప‌ట్ట‌ణ పోలీసుల‌కు అప్ప‌గించారు. ఈ మేర‌కు వారిపై కేసు న‌మోదు చేస్తామ‌ని తాండూరు ప‌ట్ట‌ణ సీఐ రాజేంద‌ర్‌రెడ్డి తెలిపారు. మ‌రోవైపు ఇసుక రవాణాపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు పంజా విస‌ర‌డంతో అక్ర‌మార్కుల్లో గుబులు మొద‌లైంది. దీంతో కొంద‌రు అక్ర‌మార్కులు స్థ‌బ్దుగా ఉండిపోయారు.