క్రిస్మస్, న్యూఇయ‌ర్ వేడుక‌ల‌పై ఆంక్ష‌లు

ఆరోగ్యం మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

క్రిస్మస్, న్యూఇయ‌ర్ వేడుక‌ల‌పై ఆంక్ష‌లు
– తెలంగాణ ప్ర‌భుత్వానికి హైకోర్టు ఆదేశం
– ఉత్త‌ర్వుల మేర‌కు న‌డుచుకుంటాం : మంత్రి హ‌రీష్ రావు
హైద‌రాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి: వ‌చ్చే క్రిస్మస్, న్యూఇయ‌ర్ వేడుక‌ల‌పై ఆంక్ష‌లు విధించాల‌ని హైకోర్టు తెలంగాణ ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. దేశంతో పాటు రాష్ట్రంలో ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతున్న నేప‌థ్యంలో గురువారం హైకోర్టు క‌రోనా, ఒమిక్రాన్ ప‌రిస్థితుల‌పై స‌మీక్షించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతోందని.. అందుకే క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు ఇవ్వాలని సూచించింది. ఇప్ప‌టికే మహారాష్ట్ర, ఢిల్లీ ఇతర రాష్ట్రాలు ఇప్పటికే కరోనా నిబంధనలు కఠినతరం చేసిందని గుర్తి చేసింది కోర్టు. అదే తరహాలోనే ఆంక్షలు పెట్టాలని.. జనాలు గుంపులుగా ఉండకుండా చూడాలని హైకోర్టు సూచించింది. ఒమిక్రాన్‌ వ్యాప్తి కట్టడికి పండగలు, వేడుకల్లో జనం గుమిగూడకుండా ఆంక్షలు విధించాలని ఆదేశించింది. దీంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒమిక్రాన్ నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.

ఆదేశాల‌ను గౌర‌విస్తాం: ఆరోగ్య శాఖ మంత్రి హ‌రీష్ రావు
తెలంగాణలో ఒమిక్రాన్‌ వేరియంట్ ప్రకంపనలు.. హైకోర్టు ఆదేశాలపై రాష్ట్ర ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌రీష్ రావు స్పందించారు.

ఒమిక్రాన్‌ కట్టడికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను గౌరవిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు పేర్కొన్నారు. హైకోర్టు ఆర్డర్‌ ఇంకా అందలేదని, అందిన వెంటనే నిర్ణయం తీసుకుంటామన్నారు. కరోనా నియంత్రణలో భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. అయితే, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రూపంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో బూస్టర్‌ డోస్‌, చిన్న పిల్లల వ్యాక్సినేషన్‌పై కేంద్రం నుంచి ఇంకా స్పష్టమైన ఆదేశాలు రాలేదని హరీశ్ రావు తెలిపారు.