కేసీఆర్ సంక్షేమ పథకాలే ఆదర్శం
– టీఆర్ఎస్‌లో చేరిన ఎంఐఎం కార్యకర్తలు
– కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : కేసీఆర్ సంక్షేమ పథకాలే అందరికి ఆదర్శనీయమని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు ఎంఐఎం పార్టీకి చెందిన యువ నాయకులు అబ్రార్ లాల తన అనుచరులతో కలిసి తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ద్వారా టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. అదేవిధంగా తాండూరు మున్సిపల్ పరిధిలోని పాత తాండూరు అభివృద్ధికి బాధ్యతగా కృషి చేస్తామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు తాండూరులో రైల్వే బ్రిడ్జి పనులకు సంబంధించి త్వరలోనే సర్వే పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా పాత తాండూరులో బస్తీ దవఖానా ఏర్పాటు చేస్తామని, పాత తాండూరు అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, వైస్ చైర్మన్ వెంకటరెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ (నయూం), సీనియర్ నాయకులు పద్దోళ్ల నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

