హస్తంలో ముసలం..!
– పీసీసీ ఉపాధ్యక్షులు తీరుపై అసంతృప్తి
– చర్యలు తీసుకోవాలంటూ పీసీసీ చీఫ్‌కు లేఖ
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని హస్తం పార్టీలో ముసలం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్న ఎం.రమేష్ మహరాజ్ తీరుపై పార్టీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు అంతర్గత వర్గపోరుతో సతమతమవుతున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు అక్కసు వెలగక్కుతున్నారని తాజా పరిణామాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌పై అవినీతిపై పార్టీ ఫ్లోర్ లీడర్ వరాల శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్‌లు పోరాటలు చేస్తున్నారు. అయితే ఇటీవల మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ జన్మదిన వేడుకలలో టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్ మహారాజ్ పాల్గొనడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఎం.రమేష్ మహారాజ్‌తో చర్చించగా పలుమార్లు ఫోన్ చేసి ఆహ్వానించడం వల్లే వెళ్లడం జరిగిందని చెప్పినట్లు వారు తెలిపారు. అయినా ఈ వ్యవహారం పార్టీ నాయకుల నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా ఉందని, పీపీసీ ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్న ఎం.రమేష్ మహారాజ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పార్టీ పీసీసీ చీఫ్‌కు రాతపూర్వకంగా లేఖ రాసినట్లు వారు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న పరిణామాలు కార్యకర్తల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. పీసీసీ ఉపాధ్యక్షులపై చర్యలు తీసుకోవాలని లేఖ రాయడం పార్టీ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.



