గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం
– తెలిస్తే సమాచారం అందించండి
– ప్రకటనలో పోలీసుల విజ్ఞప్తి
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలు వివరాలు తెలిస్తే సమాచారం అందించాలని పట్టణ పోలీసులు ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. పట్టణ ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఈనెల 3వ తేదిన అర్దరాత్రికి ముందు మున్సిపల్ పరిధి పాత తాండూరు మార్గంలోని రైల్వే గేటు సమీపంలో సుమారు 50 ఏండ్ల వయస్సు ఉన్న గుర్తుతెలియని మహిళ మృతదేహం గుర్తించినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి వద్ద ఎలాంటి ఆధారాలు లభించక పోవడంతో మృతదేహాన్ని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి మార్చురికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్ తెలిపారు. మృతురాలు వివరాలు తెలిస్తే పట్టణ పోలీసులను (సెల్: 9440627355 లేదా 9440627224) సంప్రదించాలని సూచించారు.

