రోడ్డెక్కిన విద్యార్థులు
– కరణ్ కోట్ రోడ్డు బాగుచేయాలని ఆందోళన
– స్థంభించిన రాకపోకలు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: రోడ్డును బాగుచేయాలని విద్యార్థులు రోడ్డుమీదకు వచ్చారు. బుధవారం తాండూరు మండలం కరణ్ కోట్ రోడ్డు మార్గంలో ఈ సంఘటన జరిగింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తాండూరు – కరణ్ కోట్ రోడ్డు అధ్వాన్నంగా తయారైంది. అడుగుకు ఓ గుంత పడి ఈ మార్గంలో రవాణా నరక ప్రాయంగా మారింది. కరణ్ రోడ్డు అంటేనే వామ్మో అనే పరిస్థితి ఏర్పడింది. ప్రతిరోజూ పాఠశాలకు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ఈ మార్గంలో ప్రయాణంతో విసిగిపోతున్నారు. దీంతో బుధవారం ఉదయం కరణ్ కోట్ రోడ్డు మీదకు వచ్చి దర్నాకు దిగారు. వెంటనే రోడ్డుకు మరమ్మత్తులు చేయించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల దర్నాతో అటు, ఇటూ రాకపోకలు స్థంభించాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులకు, ఆందోళన కారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. రోడ్డు మరమ్మత్తులుపై స్పష్టమైన హామి రావడంతో ఆందోళన విరమించారు.

