దుర్మార్గపు బీజేపీ..!
– భగ్గుమన్న బీఆర్ఎస్ నేతలు
– ఎమ్మెల్యేకు ఈడీ నోటీసుల జారీపై ఆగ్రహం
– మోడీ, బండిల దిష్టిబొమ్మలు దహనం
తాండూరు, దర్శిని ప్రతినిధి: దేశంలో బీజేపీ దుర్మార్గమైన పాలన చేస్తోందని ఆ పార్టీపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం బీఆర్ఎస్ తాండూరు పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం) ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాలో వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి, సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి తదితరులు పాల్గొని బీజేపీతో పాటు ప్రధాని మోడీ, బండి సంజయ్, ఈడీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నేతల నినాదాలతో అంబేద్కర్ చౌరస్తా మార్మోగింది. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని ఆశ్రమ కేసులో ఇరికిస్తున్నారని ఆరోపిస్తూ ప్రధాని మోడి, బండి సంజయ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీని నేరుగా ఎదుర్కొనే దమ్ములేని బీజేపీ ఆ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుని దుర్మార్గాలకు పాల్పడుతోందన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కేంద్రం కుట్రను బట్టబయలు చేసిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులో ఇరికించేందుకు యత్నిస్తుందన్నారు. సంబంధం లేని విధంగా డ్రగ్స్ కేసులో ఈడీ నోటీసులు జారీ చేయించిందని అన్నారు. బీజేపీ చేయిస్తున్న ఈడీ దాడులకు భయపడేది లేదన్నారు. ఎన్ని కేసులు పెటీనా న్యాయ పోరాటంతో బీజేపీకి బీఆర్ఎస్ బుద్ది చెప్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మంకాల రాఘవేందర్, బీఆర్ఎస్ పట్టణ ఉపాధ్యక్షులు హరిహరగౌడ్, మాజీ కౌన్సిలర్ ఇర్ఫాన్, నాయకులు చెస్ బసప్ప, కరుణాకర్, ఇంతియాజ్ చంటియాదవ్, మోయిజ్ తదితరులు పాల్గొన్నారు.

