కేటుగాళ్ల కొత్త వ్యూహాలు..!
– ఆధార్‌తో డబ్బులు దోస్తున్న వైనం
– జాగ్రత్తగా ఉండాలంటున్న నిపుణులు
దర్శిని డెస్క్ : సులువుగ డబ్బులు సంపాదించాలనుకునే కేటుగాళ్లు రోజుకో కొత్త వ్యూహాలను పన్నుతున్నారు. ఆధార్ కార్డుతో డబ్బులు డ్రా చేసుకునే వారినే లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి మోసాలపై జాగ్రత్తగా ఉండాలని పోలీసులు, టెక్నాలజీ నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవల ఆధార్ కార్డుతో డబ్బులు డ్రా చేస్తున్న ముఠాను తెలంగాణ సీఐడీ పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాదులో పని చేసే ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ఖాతా నుండి ఆధార్ కార్డుపై ఉండే వేలి ముద్రలతో కేటుగాళ్లు మూడు దఫాల్లో డబ్బులు విత్‌డ్రా చేశారు నిందితులు.. అనుమానం వచ్చిన ప్రభుత్వ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు నిజం బయటపడింది. తనకు తెలియకుండానే తన ఖాతా నుండి 24 వేల రూపాయలు విత్‌డ్రా చేసినట్టు మెసేజ్ వచ్చింది. ఫిర్యాదు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన అధికారులకు అసలు నిజం తెలిసింది. ఫింగర్ ప్రింట్ ద్వారానే డబ్బులు విత్ డ్రా అయినట్టు పోలీసుల విచారణలో బయటపడింది.
అయితే తాను ఎక్కడ ఫింగర్ ప్రింట్ ద్వారా డబ్బులు చేయలేదని బాధితుడు చెప్పటంతో పోలీసులు మరో కోణంలో దీన్ని విచారించారు. డబ్బులు విత్ డ్రా చేయబడిన లొకేషన్ నుండి పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. నిందితులు తయారు చేసిన ఆర్టిఫీషియల్ ఫింగర్, ప్రింట్స్ ద్వారా డబ్బులు విత్ డ్రా చేసినట్టు పోలిసులు గుర్తించారు.
వేలి ముద్రలతో ఎలా దోస్తారంటే..
చాలా చోట్ల ఆధార్ ద్వారా ఆన్‌లైన్‌లో డబ్బులు విత్ డ్రా చేసే విధానం అమల్లో ఉంది. కొన్ని ఊర్లలో సీనియర్ సిటిజన్స్ చాలామంది ఈ విధానం వల్లే నగదు విత్ డ్రా చేస్తున్నారు. అయితే దీన్ని ఆసరాగా చేసుకున్న కేటుగాళ్లు ఆధార్ నంబర్ని కేంద్రంగా చేసుకొని, నకిలీ ఫింగర్ ప్రింట్ సృష్టించి బ్యాంకుల నుండి డబ్బు విత్ డ్రా చేస్తున్నారు. ఫింగర్ ప్రింట్స్ ను కట్ చేసుకుని, ఆ ఫింగర్ ప్రింట్స్ ద్వారా ఆర్టిఫిషియల్ గా తయారయ్యే వేలిముద్రలను తయారు చేస్తున్నారు. సిలికాన్ తో తయారు చేయబడిన ఫింగర్ ప్రింట్స్ వాడుతూ దాని ద్వారా ఆధార్ నoబర్ జత చేసి నగదు దోచేస్తున్నారు. ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి…

