గోశాలలో స్వార్థ రాజకీయాలు..!
– సభ్యులకు సమాచారం లేకుండా ఎన్నికలు
– కొత్త కార్యవర్గం రాజీనామా చేయాల్సిందే
– ఎంపీటీసీ ప్రవీణ్ కుమార్, బీజేపీ ఇంచార్జ్ రజనీకాంత్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని గోశాలలో స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని, నిబంధనలకు విరుద్దంగా ఎన్నికలు నిర్వహిస్తున్నారని యువనాయకులు, ఎంపీటీసీ ప్రవీణ్ కుమార్, బీజేపీ తాండూరు నియోజకవర్గ ఇంచార్జ్ రజనీ కాంత్, యువనాయకులు అంతారం కిరణ్ లు అన్నారు. సోమవారం వారు మీడియాతో మాట్లాడారు. 2014-15 ఏడాదిలో అప్పటి మున్సిపల్ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య ఆధ్వర్యంలో తాండూరులో గోశాలను ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. ఇందులో 238 మంది జీవితకాల సభ్యత్వం కలిగిన సభ్యులు ఉన్నారని వెల్లడించారు.
ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలనే నిబంధన ఉందని తెలిపారు. అయితే తాజాగా గోశాల సేవా సమితి కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని, దీనిని ఖండిస్తన్నట్లు పేర్కొన్నారు. సభ్యులకు సమాచారం ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహించడంలో మతలబు ఏంటని ప్రశ్నించారు. జీవితకాల సభ్యులకు కనీసం సమాచారం ఇవ్వకుండా ఏకగ్రీవంగా ఎన్నికలను నిర్వహించుకున్నామని ప్రకటించుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలకు గోశాలను వాడుకుంటున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఏకగ్రీవ ఎన్నికలు చెల్లవని, ఎన్నుకోబడిన సభ్యులు తమ పదవులకు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమని హెచ్చరించారు.
ప్రతి హిందూ ఉత్సవాలను రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో శివాజీ జయంతి ఉత్సవాలను రాజకీయం చేశారని, తాజాగా తాజాగా గోశాలను కూడా రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా సాగుతున్న సంస్థలను రాజకీయం చేయడం ఎంత వరకు సమంజసమని అన్నారు. ఇలాంటి పరిణామాలు హిందూ జాతికి..హిందూ సంస్థలకు ప్రమాదం పొంచి ఉందని అభిప్రాయ పడ్డారు. హిందూవులకు జరిగే అన్యాయాలను చూస్తూ ఊరుకోబొమని హెచ్చరించారు.
ఇదికూడా చదవండి…

