బల్దియాకు బంపర్ బొనాంజ..!
– బహిరంగ వేలంలో రాష్ట్ర స్థాయి రికార్డు
– చికెన్, మటన్ వ్యర్థాల సేకరణ వేలంకు స్పందన
– రూ. 30.65లక్షలకు దక్కించుకున్న కోడంగల్ వాసి
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని తాండూరు మున్సిపల్ కు బంపర్ బొనాంజ తగిలింది. పట్టణంలో చికెన్, మటన్ మాంసాల వ్యర్థాల సేకరణ ఏజెన్సీలకు నిర్వహించిన బహిరంగ వేలంలో రాష్ట్ర స్థాయిలోనే రికార్డు ఆధాయాన్ని దక్కించుకుంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బహిరంగ వేలంలో రూ.30లక్షల 65 వేల ఆధాయాన్ని సొంతం చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. గత కొన్ని రోజుల క్రితం తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి ఆదేశాల మేరకు తాండూరు పట్టణంలో చికెన్, మటన్, చేప మాంస వ్యర్థాలను సేకరించి తరలించేందుకు 19న బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం నిర్వహించిన బహిరంగ వేలానికి భారీ స్పందన లభించింది.
తాండూరు పట్టణంతో పాటు కోడంగల్, పరిగి, గద్వాల ప్రాంతాలకు చెందిన వ్యాపారులు వేలంలో పాల్గొన్నారు. మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి ఆధ్వర్యంలో వేలం నిర్వహించారు. మొత్తం 5మంది వ్యాపారులు పాల్గొనగా కోడంగల్ కు చెందిన రఫీ అనే వ్యాపారి అత్యధికంగా రూ.30లక్షల 65వేలు వేలం పాడి దక్కించుకున్నారు.

బహిరంగ వేలంలో మున్సిపల్ కు ఇంత మొత్తం ఆధాయం రావడం రికార్డు అని మున్సిపల్ కమీషనర్ తెలిపారు. ఎక్కడా లేని విధంగా తాండూరు మున్సిపల్ రాష్ట్ర స్థాయిలో ఘనతను సాధించిందని అన్నారు. అదేవిధంగా వేలం దక్కించుకున్న వ్యాపారి ఏడు రోజుల్లో మొత్తం చెల్లిస్తే వచ్చేనెల 1వ తేది నుంచి టెండర్ ను అందజేస్తామని స్పష్టం చేశారు.
ఇదికూడా చదవండి…

