రేపటి నుంచే రైతు భరోసా..!

తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

రేపటి నుంచే రైతు భరోసా..!
– ఎకరాలతో సంబంధం లేకుండా జమ
– కొత్త రైతులకు కూడా పథకం అమలు..?
– రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు రేవంత్ సర్కారు కీలక ప్రకటన చేసింది. రైతుల కోసం అమలు చేస్తోన్న రైతు భరోసాపై నిర్ణయం తీసుకుంది. ఎకరాలతో సంబంధం లేకుండా రైతు భరోసా ఇవ్వాలని తాజా కేబినెట్ మీటింగ్‌లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ ఈ మేరకు రైతు భరోసా స్కీమ్ డబ్బులుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి అంటే జూన్ 17 నుంచి రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈసారి మొత్తం 1 కోటి 49 లక్షల 35 వేల ఎకరాల భూములకు రైతు భరోసా నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. ఎకరాల పరిమితి లేకుండా అర్హులైన ప్రతి రైతుకూ ఈ భరోసా సాయం అందజేసేందుకు చర్యలు చేపట్టింది. ఎవరికైనా రెండు, మూడు, లేదా అంతకంటే ఎక్కువ ఎకరాలు ఉన్నా, వాటన్నింటికీ సాయం చేస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రతి ఏటా వానాకాలం వ్యవసాయ సీజన్‌కు ముందుగా నిర్వహించే రైతు భరోసా అర్హుల గుర్తింపు ప్రక్రియను ఈసారి కూడా విజయవంతంగా పూర్తిచేశారు.

కొత్త రైతులకు కూడా…
వివిధ కారణాల వల్ల పెట్టుబడి సాయం పొందకుండా మిగిలిపోయిన అన్నదాతలందరికీ ‘రైతు భరోసా’ పథకాన్ని వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా యోచిస్తోంది. ప్రతి రైతుకు న్యాయం చేయాలని ఉద్దేశంలో భాగంగా ఇటీవల జనవరిలో కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతులకు ఇప్పటికే యాసంగి సీజన్‌లో పథకానికి అవకాశం కల్పించారు.

ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అర్హులైన రైతుల వివరాలను జూన్ 20లోగా అధికారిక దస్త్రాల్లో నమోదు చేయాలని ఆదేశించింది. అలాగే గతంలో వివిధ కారణాల వల్ల పథకానికి అందని రైతులకు ఈసారి సహాయం అందించేందుకు మార్గం సుగమమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల రైతులకు ఊరట లభించనుంది.

ఇదికూడా చదవండి…

అట్టహసంగా జీఏంకే డబ్ల్యూపీఎల్ ముగింపు