అదనపు కట్నం వేధించిన భర్త..!
– పదేళ్ల కఠిన జైలు శిక్ష విధిస్తూ తీర్పు
– రూ. 5వేల జరిమాన విధించిన జిల్లా న్యాయస్థానం
– వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి
వికారాబాద్/తాండూరు, దర్శిని ప్రతినిధి : అదనపు కట్నం కోసం భార్యను వేధించి ఆమె ఆత్యహత్యకు కారకుడైన భర్తకు వికారాబాద్ జిల్లా న్యాయస్థానం పదేళ్ల కఠిన జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించినట్లు వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఓ ప్రకటనలో కేసు వివరాలను వెల్లడించారు.

వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరుకు చెందిన చాకలి చంద్రమ్మ తన రెండో కూతురు అనూషను 2018 ఏప్రిల్ 24న దౌల్తాబాద్ మండలం చంద్రకళ్ గ్రామానికి చెందిన చాకలి అరుణ్‌కు ఇచ్చి వివాహాము జరిపారు. పెళ్లి సమయంలో వరకట్నం కింద అరుణ్‌కు 2.5తులాల బంగారంతో పాటు రూ. 81వేల నగదును ఇచ్చుకున్నారు. కొన్నాళ్లు సంతోషంగా ఉన్న అరుణ్ కుమార్ అనూషను అదనపు కట్నం కోసం వేధించసాగాడు. అనుమానం పెంచుకుని మానసికంగా హింసించేవాడు. ఈ వేధింపులు తాళలేక అనూష అదే యేడాది సుమారు మూడు నెలల తరువాత ఆగస్టు 3వ తేదిన ఇంట్లో ఎవరు లేని సమయంలో దూళానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

అనూష తల్లి చాకలి చంద్రమ్మ ఫిర్యాదుతో తాండూరు పట్టణ పోలీసులు భర్త అరుణ్ కుమార్‌పై కేసు నమోదు చేశారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ & సెషన్స్ జడ్జి డాక్టర్ ఎస్. శ్రీనివాస్ రెడ్డి కేసు వాదోపవాదనలు విని నిందితుడు చాకలి అరుణ్‌ను దోషిగా నిర్ధారించారు. దీంతో నిందితుడు అరుణ్ కుమార్‌కు పది (10) సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 5,000లు జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఆరు (6) నెలల పాటు కఠిన కారాగార శిక్ష అనుభవించాలని తీర్పు ఇచ్చారని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు, ప్రాసిక్యూషన్‌లో అద్భుతంగా పని చేసిన అధికారులను జిల్లా ఎస్పీ శ్రీ కె. నారాయణ రెడ్డి, ఐపీఎస్ గారు ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా వరకట్న వేధింపులకు పాల్పడే వారికి ఈ తీర్పు ఒక హెచ్చరికగా నిలుస్తుందని, బాధితులకు న్యాయం అందించడంలో పోలీసులు కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు. మహిళల భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.

ఇదికూడా చదవండి…

