ఒక్క క్లూ కూడా లేదు..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

ఒక్క క్లూ కూడా లేదు..!
– అయినా హత్య కేసు చేధింపు
– వీడిన అడవిలో మహిళ మర్డర్ మిస్టరీ
– వివరాలు వెల్లడించిన డీఎస్పీ నర్సింగ్ యాదయ్య
– ఇద్దరు నిందితుల రిమాండుకు తరలింపు
తాండూరు, దర్శిని ప్రతినిధి : హత్య స్థలంలో ఒక్క క్లూ కూడా లేని మర్డర్ కేసును తాండూరు పోలీసులు చేధించారు. హత్య కేసులో నిందితులను కటకటాల్లోకి పంపించారు. ఈనెల 24న పెద్దేముల్ మండలం రేగొండి అటవి ప్రాంతంలో జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు చేధించారు. మంగళవారం తాండూరు డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ నర్సింగ్ యాదయ్య రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్, పెద్దేముల్ ఎస్ఐ శంకర్ తో కలిసి కేసు వివరాలను వెల్లడించారు.

యాలాల మండలం పగిడ్యాల గ్రామానికి చెందిన లొంకల బంబీయమ్మ అలియాస్ బందెమ్మ (54) తాండూరు ప్రాంతంలో లేబర్ కూలీగా పనిచేసేది. పెద్దేముల్ మండలం బండమీదిపల్లి గ్రామానికి చెందిన మాల నర్సింలు(54), కర్ణాటక రాష్ట్రం బసవ కళ్యాణ్ ప్రాంతానికి చెందిన కిశోష్ షిండే (29)లు కూడా అడ్డా కూలీలుగా పనిచేసే వారు.

ఆభరణాలకు ఆశపడి…
కూలీగా పనిచేసే బందెమ్మపై ఒంటిపై ఉన్న కాళ్ల కడియాలు, పుస్తెల దండ, ముక్కు పుడక ఆబరాణాలపై మాల నర్సింలు, కిషోర్ షిండేల కన్నుపడింది. ఆమె నుంచి వాటిని సొంతం చేసుకోవడంలో భాగంగా ఆమెను హత్య చేసేందుకు నిర్ణయించుకున్నారు.

ఇందులో భాగంగా ఈనెల 21న మాల నర్సింలు, కిషోర్ షిండేలు బందెమ్మను పెద్దేముల్ మండలంలో పని ఉందని చెప్పి వెంట తీసుక వెళ్లారు. మంబాపూర్ నుంచి రేగోండీ ఆటవిప్రాంతం వైపు తీసుకవెళ్లారు. అక్కడ నర్సింలు బందెమ్మ గొంతుపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. ఇందుకు కిషోర్ షిండే సహాకారం అందించాడు. ఆమె మృతి చెందిన తరువాత ఒంటిపై ఉన్న కాళ్ల కడియాలు, 2.4 గ్రాముల పుస్తెల దండ, ముక్కు పుడకతో పాటు మృతురాలి సెల్ ఫోన్ కూడా తీసుకుని వెళ్లిపోయారు. దొంగలించిన ఆభరణాలను శంకర్ పల్లిలో రూ.49వేలకు అమ్ముకున్నారు.

దొరికిపోయారు ఇలా
ఈనెల 24న రేగోండి అటవి ప్రాంతంలో బందెమ్మ మృతదేహం పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలం వద్ద పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతురాలి కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని డీఎస్పీ నర్సింగ్ యాదయ్య ఆదేశాలతో రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ శంకర్ లు దర్యాప్తు ప్రారంభించారు.

ఎలాంటి క్లూలు లేకపోవడంతో నిరాశ చెందకుండా ప్రయత్నం చేశారు. తాండూరు పట్టణంలో అడ్డా కూలీలు ఉండే ప్రాంతంలో సీసీ కెమెరాలను పరిశీలించగా నిందితులను గుర్తించారు. హంతకులు మృతురాలు బందెమ్మను ఆర్టీసీ బస్సులో మంబాపూర్ తీసుకెళ్లారని, అక్కడి నుంచి అటవీ ప్రాంతంలోకి తీసుకవెళ్లి హత్య చేసినట్లు నిర్ధారించారు. మంగళవారం తాండూరు పట్టణంలోని అడ్డా వద్దకు నిందితులు నర్సింలు, కిషోర్ షిండేలు వచ్చిన విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య తెలిపారు. ప్రధాన నిందితుడు నర్సింలుపై 2021లో హత్య కేసు నమోదు కావడంతో జైలుకు వెళ్లి వచ్చాడని తెలిపారు. మరోవైపు కేసు చేధనలో చాకచక్యంగా పనిచేసిన హెడ్ కానిస్టేబుల్ దస్త్రయ్య, మున్యయ్య, ప్రతాప్, కిష్ణారెడ్డి, అంజద్, శివలతో పాటు ప్రైవేటు సిబ్బంది అంజిలకు అభినందించి రివార్డులను అందజేశారు.

ఇదికూడా చదవండి…

మున్సిపల్‌ ఎన్నికలకు రెడీ..!