పసికందుకు పునర్జన్మ..!
– నెలలు నిండని చిన్నారికి సీపీఆర్
– అంబులెన్స్ ఈఎన్టీ చొరవతో నిలిచిన ప్రాణం
తాండూరు, దర్శిని ప్రతినిధి : నెలలు నిండకుండా జన్మించి.. గుండె చప్పుడు ఆగిపోయిన పసికందుకు సీపీఆర్ ద్వారా పునర్ జన్మ అందింది. అంబులెన్స్ ఈఎన్టీ చొరవతో ప్రాణం దక్కింది.

ఈ సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట్ మండలం తుంకిమిట్ల గ్రామానికి చెందిన భువనేశ్వరి, నవీన్ దంపతులకు మూడు రోజుల క్రితం తాండూరులోని మాతా శిశు ఆసుపత్రిలో మగ శిశువు జన్మించాడు. అయితే శిశువు నెలలు నిండకముందే, కేవలం ఏడు నెలలకే జన్మించడంతో ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది.

శిశువుకు గుండె స్పందన (హార్ట్‌బీట్) తక్కువగా ఉండటంతో పాటు శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో మెరుగైన వైద్యం కోసం వైద్యులు శిశువును హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఈ క్రమంలో 108 అంబులెన్స్‌లో శిశువును హైదరాబాద్‌కు తరలిస్తుండగా, మన్నెగూడ సమీపానికి చేరుకున్న సమయంలో ఒక్కసారిగా శిశువు గుండె స్పందన ఆగిపోయింది. పరిస్థితిని వెంటనే గుర్తించిన అంబులెన్స్ ఈఎంటీ శాంత్‌కుమార్ అప్రమత్తమై శిశువుకు అత్యవసర సీపీఆర్ చేశారు.

దీంతో శిశువుకు మళ్లీ ఊపిరి పీల్చుకోవడంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం శిశువును సురక్షితంగా హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పసికందుకు ఈఎన్టీ శాంత్‌కుమార్ సమయస్పూర్తితో వ్యవహరించడంతో పసికందుకు పునర్ జన్మ దక్కింది. ఈఎన్టీ అందించిన సేవలకు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు వైద్యులు, పలువురు సిబ్బంది ఈఎన్టీ శాంతుకుమార్‌ను అభినందించారు.


